Adinarayana Reddy: భాజపాలో చేరాలని వైకాపా ఎంపీలు ప్రయత్నిస్తున్నారు

వైకాపా ఎంపీలు భాజపాలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని, తమ పార్టీ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారని మాజీ మంత్రి, జమ్మలమడుగు నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.


అమరావతి: వైకాపా ఎంపీలు భాజపాలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని, తమ పార్టీ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారని మాజీ మంత్రి, జమ్మలమడుగు నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి మినహా మిగిలిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులంతా భాజపాలో చేరాలనుకుంటున్నారని, ఇందుకు ప్రయత్నాలు కూడా ప్రారంభించారని చెప్పారు. తమ పార్టీ అధిష్ఠానం ఇందుకు సుముఖంగా లేదన్నారు.

శాసనసభ లాబీల్లో శుక్రవారం ఆయన కొద్దిమంది విలేకరులతో పిచ్చాపాటీగా మాట్లాడారు. స్వయంగా మిథున్‌రెడ్డి భాజపా నాయకత్వంతో మాట్లాడుతున్నారని చెప్పారు. ఆయన తన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా భాజపాలోకి రావాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. వైకాపా ఖాళీ కావడం ఖాయంగా కనిపిస్తోందన్నారు. భాజపా నాయకత్వం వద్దంటున్నా మిథున్‌రెడ్డి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని ఆదినారాయణరెడ్డి తెలిపారు.

జగన్‌ ఓదార్పు యాత్ర కోసం 14 కారణాలు వెదుక్కుంటున్నారని ఆరోపించారు. ఏ కారణం దొరక్కపోతే, ఏ దారీ కనిపించకపోతే ఆయన బాధితులను సృష్టించుకుంటారని అన్నారు. ఈ ఎన్నికల్లో తన చెల్లి షర్మిల వల్ల నష్టపోయానని జగన్‌ అనుకుంటున్నారని, ఆమెతో రాజీ చేయాలని తల్లిని కోరారని.. షర్మిల ఇందుకు తిరస్కరించారన్నారు.. అన్ననే వచ్చి కాంగ్రెస్‌లో చేరాలని షర్మిల చెప్పేశారన్నారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్‌రెడ్డి బెయిల్‌ రద్దవుతుందని.. ఆయన మళ్లీ అరెస్టవుతారన్నారు. రాష్ట్రానికి కేంద్ర సాయం అవసరమన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని జగన్‌ అస్తవ్యస్తం చేశారన్నారు. ఖజానాకు గుండుకొట్టి వెళ్లిపోయారని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీ లేదా, ఇతరత్రా మార్గాల్లో కేంద్రం ఆర్థిక సాయం చేయాల్సి ఉంటుందన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని కూడా కేంద్రం సవరించి రాష్ట్ర అభివృద్ధికి ఆర్థికంగా తోడ్పడాలని ఆదినారాయణరెడ్డి కోరారు.