రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సలహాదారు ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కారు. కోడ్‌ను ఉల్లంఘించి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగుల సంఘం నాయకుడిగా ఉన్న సమయంలోనే వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన ఆయన ఇప్పుడు పూర్తిగా ముసుగు తొలగించేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న విషయాన్ని ఉద్దేశ పూర్వకంగానే విస్మరించి..
వైసీపీకి ఓటు వేయాలంటూ ఉద్యోగులపై పరోక్షంగా ఒత్తిడి తేవడం ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ జగన్ సర్కార్‌కు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. మే 13న జరిగే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఉద్యోగులంతా ఓటు వేసి, జగన్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఇదే సమయంలో తాము అధికారంలోకి వచ్చాక తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామంటున్న విపక్ష నేతలకు సైతం హెచ్చరికలు చేశారు.”ఉద్యోగులు ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా.. ప్రతిపక్షాల మాట వింటారా? రూల్స్ అనేవి ప్రభుత్వం పెడుతుందా? ప్రతిపక్షాలు రూపొందిస్తాయా?
ఉద్యోగుల జోలికి వస్తే.. సహించేది లేదు” అని తీవ్రంగా హెచ్చరించారు. మంగళవారం అమరావతి సచివాలయంలో తన చాంబర్‌లో మీడియా సమావేశం నిర్వహించి, ప్రతిపక్ష పార్టీల నేతలకు తీవ్ర హెచ్చరికలు చేయడం గమనార్హం. ఇదేసమయంలో కోడ్‌ను ఉల్లంఘించి ప్రభుత్వ కార్యాలయంలో కూర్చుని ఉద్యోగులు ప్రభుత్వానికి మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు.రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో ప్రస్తుత సీఎం వలంటీర్, గ్రామ సచివాలయ వ్యవస్థ తెచ్చారని తెలిపారు. దీనికి మంచి పేరు రావడంతో ప్రతిపక్ష పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు. ప్రభుత్వాన్ని తప్పు పట్టడం ఫ్యాషన్ అయిపోయిందన్నారు. కాగా, చంద్రశేఖర్‌రెడ్డి వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సలహాదారుగా ఉన్న ఆయన వైసీపీ నాయకుడిగా మారి ఇలా ప్రచారం చేయడం ఏంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.