NZ vs AFG : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో మ‌రో సంచ‌ల‌నం.. న్యూజిలాండ్‌పై అఫ్గానిస్తాన్‌ ఘ‌న విజ‌యం..

New Zealand vs Afghanistan : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో మ‌రో సంచ‌ల‌నం న‌మోదైంది. మొన్న పాకిస్తాన్ జ‌ట్టును అమెరికా సూప‌ర్ ఓవ‌ర్‌లో ఓడించ‌గా తాజాగా ప‌టిష్ట న్యూజిలాండ్‌ను అఫ్గానిస్తాన్ మ‌ట్టిక‌రిపించింది. గ‌యానా వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో కివీస్ పై అఫ్గాన్ 84 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని సాధించింది.


ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 159 ప‌రుగులు చేసింది. అఫ్గాన్ బ్యాట‌ర్ల‌లో రహ్మానుల్లా గుర్బాజ్ (80; 56 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ కొట్టాడు. ఇబ్రహీం జద్రాన్(44; 41 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), అజ్మతుల్లా (22 13 బంతుల్లో 1 ఫోర్‌, 2సిక్స‌ర్లు) లు రాణించారు. కివీస్ బౌల‌ర్ల‌లో ట్రెంట్ బౌల్ట్‌, మాట్ హెన్రీ చెరో రెండు వికెట్లు తీశారు. లాకీ ఫెర్గూస‌న్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో కివీస్ త‌డ‌బ‌డింది. అఫ్గాన్ బౌల‌ర్ల దాటికి 15.2 ఓవ‌ర్ల‌లో 75 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. స్టార్ ఓపెన‌ర్ ఫిన్ అలెన్ డ‌కౌట్ కాగా డేవాన్ కాన్వే (8), కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్ (9), డారిల్ మిచెల్ (5), మార్క్ చాప్‌మెన్ (4), బ్రాస్‌వెల్ (0) లు త‌క్కువ ప‌రుగుల‌కే పెవిలియ‌న్‌కు చేరుకున్నారు.

గ్లెన్ ఫిలిఫ్స్‌(18), మాట్ హెన్రీ (12) లు మాత్ర‌మే రెండు అంకెల స్కోరు సాధించారు. అఫ్గానిస్తాన్ బౌల‌ర్ల‌లో ఫజల్హక్ ఫారూఖీ, రషీద్‌ ఖాన్ లు చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. మ‌హ్మ‌ద్ న‌బీ రెండు వికెట్లు సాధించాడు. ఈ విజ‌యంతో అఫ్గానిస్తాన్ నాలుగు పాయింట్ల‌తో గ్రూప్ సిలో అగ్ర‌స్థానానికి చేరుకుంది.