వైసీపీ వేధింపులు తట్టుకుని నిలబడిన గొట్టిపాటి
ఐదేళ్లలో ఎన్నో ఇబ్బందులు
పార్టీ మారాలని జగన్ సర్కారు తీవ్ర ఒత్తిళ్లు
క్వారీలపై దాడులు.. మూసివేతలు
రూ.300 కోట్ల వరకు జరిమానాలు
అయునా తొణకని రవికుమార్
క్వారీలు మూయించారు.. వందల కోట్ల జరిమానాలు విధించారు.. పార్టీ మారాలని అనేక రకాలుగా ఒత్తిళ్లు తెచ్చారు.. ఆర్థికంగా నష్టపరిచారు.. అధికార యంత్రాంగాన్ని ప్రయోగించి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని చూశారు.. అనుచరుల ఫ్యాక్టరీల మీదకూ దండెత్తారు.. అయినా అన్నిటినీ భరించి వైసీపీని దీటుగా ఎదుర్కొన్నారు.. ఈ కష్టాలను గుర్తించిన టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు మంత్రి పదవి కట్టబెట్టారు. కొత్తగా కొలువుదీరిన రాష్ట్ర మంత్రివర్గంలో బాపట్ల జిల్లా నుంచి ఈయనతోపాటు రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌కు అమాత్యయోగం వరించింది. వీరిద్దరూ తొలిసారి మంత్రి పదవి చేపట్టడం గమనార్హం.
గొట్టిపాటి 2004లో ప్రకాశం జిల్లా మార్టూరు నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మార్టూరు స్థానం రద్దయింది. 2009 ఎన్నికల్లో గొట్టిపాటి అద్దంకి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2014లో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి హ్యాట్రిక్ కొట్టారు. తర్వాతి పరిస్థితుల్లో టీడీపీలో చేరారు. 2019, 2024లో టీడీపీ నుంచి గెలుపొందారు. వరుసగా ఐదు సార్లు గెలుపొంది ఓటమెరుగని నేతగా గుర్తింపు పొందారు.
2019-24 మధ్య గొట్టిపాటే లక్ష్యంగా జగన్ సర్కారు పెద్ద ఎత్తున కక్షసాధింపులకు తెరలేపింది. పార్టీ మారాలని పై స్థాయిలో పెద్దఎత్తున ఒత్తిళ్లు వచ్చాయి. వేటికీ లొంగకపోవడంతో ఆయన ఆర్థికమూలాలను దెబ్బకొట్టేందుకు పథక రచన చేసి గనుల అధికారులను ఆయన ఫ్యాక్టరీలపైకి ఉసిగొల్పారు. దాదాపు రూ.300 కోట్ల మేర జరిమానాలను విధించారు. క్వారీలు మూయించారు. కేసులు పెట్టించారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు ఆయన బంధువుల గ్రానైట్ క్వారీల్లో తనిఖీల పరంపరకు వైసీపీ తెరలేపింది. అయినా గొట్టిపాటి చలించలేదు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అన్నిటినీ తట్టుకుని నిలబడడం వల్లే తొలిసారి మంత్రివర్గంలో చోటు దక్కించుకోగలిగారు.
ఈసారి ఎలాగైనా గొట్టిపాటిని ఓడించాలని జగన్మోహన్‌రెడ్డి బాబాయి, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సిఫారసు మేరకు పల్నాడు జిల్లాకు చెందిన పాణెం హనిమిరెడ్డిని అద్దంకి వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిపారు. వలంటీర్లను రెచ్చగొట్టడం మొదలుకుని జగన్ సిద్ధం సభకు సైతం అద్దంకి నియోజకవర్గాన్నే వేదికగా ఎంచుకుని కవ్వింపు చర్యలకు దిగారు. రవికుమార్ వాటిని తిప్పికొట్టి ఎమ్మెల్యేగా వరుసగా ఐదోసారి విజయం సాధించడమే కాకుండా మంత్రి పదవి సాధించారు.