కలెక్టర్‌పై ఉద్యోగుల గుర్రు

www.mannamweb.com


గ్రీవెన్స్‌, ఇతర సమావేశాల్లో అధికారులపై అరుపులు, కేకలు
వీడియో కాన్ఫరెన్స్‌లో ఒక ఎంపిడిఒను నిల్చోబెట్టి అవమానం
సాధారణ సందర్శకులతో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వని వైనం
కార్యాచరణకు సిద్ధమవుతున్న ఎన్‌జిఒ, రెవెన్యూ అసోసియేషన్‌
జిల్లా పాలనా యంత్రాంగాన్ని నడిపించే విషయంలో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వశాఖల అధికారులు, ఉద్యోగులను కలుపుకొనిపోయి వారితో కలిసి పనిచేయడంలో సమన్వయం కొరవడుతోంది. పనిఒత్తిడి రీత్యా కలెక్టర్‌లో సహజంగా ఉండే కోపం, అసహనం ఆయనకు, ఉద్యోగులకు మరింత గ్యాప్‌ పెరచుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ‘మీకోసం’, ఇతర సమావేశాల్లో తమపై కలెక్టర్‌ వ్యవహరిస్తున్న తీరుపై అధికారులు, ఉద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నారు. తమను తోటి అధికారుల ముందు అవమానించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. కలెక్టర్‌ తీరుపై చర్చించి, కార్యాచరణను రూపొందించేందుకు ఎపి ఎన్‌జిఒ, రెవెన్యూ అసోసియేషన్‌ ఈనెల 24న విడివిడిగా సమావేశం కావాలని నిర్ణయించినట్లు తెలిసింది.

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఐఎఎస్‌ల బదిలీల్లో భాగంగా జూలై ఐదో తేదీన కలెక్టర్‌గా స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ జిల్లాకు వచ్చారు. అంతకుముందు ఆయన చిత్తూరు, నూజివీడు ప్రాంతాల్లో సబ్‌ కలెక్టర్‌గా పనిచేశారు. విశాఖపట్నం మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌లో రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. నెల్లూరు, విజయవాడ, కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్ల కమిషనర్‌గా పనిచేశారు. మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌పై గట్టి పట్టు సాధించిన ఆయన ఇతర ప్రభుత్వశాఖల దగ్గరకొచ్చేసరికి అంత అవగాహన లేదనే చర్చ అధికారుల్లో నడుస్తోంది. రెవెన్యూశాఖ చూడాల్సిన విధులను వైద్యారోగ్యశాఖకు, ఆ శాఖ చూడాల్సిన బాధ్యతలను రెవెన్యూశాఖ అప్పగిస్తున్నట్లు ఉద్యోగులు బహిరంగంగానే అనుకుంటున్నారు. ప్రభుత్వ శాఖలపై సమీక్షల సందర్భంగా అధికారులు, ఉద్యోగులపై అసహనంతో విరుచుకుపడుతున్నట్లు చెప్తున్నారు. అనుభవ రాహిత్యం పలు అంశాల్లో ప్రస్ఫుటమవుతోంది. ఒడిశా నుంచి ఫేక్‌ బిల్లులతో ఇసుకను రవాణా చేస్తున్నారని మీడియా సమావేశంలో విలేకరులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా, ఒడిశా అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి ఫేక్‌ బిల్లులను వారికి చూపించి సరైనవో, కావో తేలుస్తామంటూ చెప్పడంతో అంతా అవాక్కయ్యారు. ఆగస్టు 28న నిర్వహించిన జెడ్‌పి సర్వసభ్య సమావేశంలో ఎరువుల కొరత, కరకట్టల నిర్మాణం, సాగునీటి ప్రాజెక్టులు వంటి అంశాలపై సభ్యులు లేవనెత్తిన అంశాలను చివరి వరకు నోట్‌బుక్‌లో రాస్తూనే కనిపించారు తప్ప వాటికి బదులివ్వలేదు.

సందర్శకులకూ నిరాశే

కలెక్టరేట్‌కు నిత్యం పదుల సంఖ్యలో జిల్లాలోని పలు ప్రాంతాల ప్రజలు వినతులతో వస్తుంటారు. సాధారణంగా కలెక్టర్‌ ఛాంబరు వద్ద వెయిటింగ్‌ హాల్‌లో వారిని కూర్చోబెట్టి ఒక్కొక్కరినీ పిలిచి వారి సమస్యను అడిగి తెలుసుకునే పరిస్థితి గతంలో ఉండేది. ఆ సమస్యపై సంబంధిత అధికారులతో నేరుగా మాట్లాడటమో, ఆ వినతిపత్రంపై సంతకం చేసి పిఎస్‌ ద్వారా పంపడమో గత కలెక్టర్లు చేసేవారు. స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ వచ్చిన తర్వాత ఛాంబరు బయటే వారి వినతులు తీసుకుని పంపేస్తున్న పరిస్థితి నెలకొంది. సుదూర ప్రాంతాల నుంచి చాలా వ్యయ ప్రయాసలకోర్చి వస్తున్న సందర్శకులు, తమ సమస్యను కలెక్టర్‌కు పూర్తిగా చెప్పుకోలేకపోయామనే నిరాశతోనే వారు వెనుదిరుగుతున్నారు.

గంటల కొద్దీ అధికారుల పడిగాపులు

ఫైళ్ల క్లియరెన్స్‌ కోసం కలెక్టరేట్‌కు వచ్చే అధికారులు కలెక్టర్‌ తీరుతో చుక్కలు చూస్తున్నారు. సాయంత్రం ఐదు గంటలకు పిలిచి రాత్రి పది, 11 గంటల వరకు ఉంచుతున్నట్లు అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 11 గంటల వరకు వెళ్లిన అధికారులు మధ్యాహ్నం మూడు గంటల వరకు నిరీక్షిస్తున్న పరిస్థితి నెలకొంది. బిపి, సుగర్‌ ఉన్న అధికారులు, ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రెండు నెలల కిందట కలెక్టరేట్‌కు రావాలంటూ ఎంపిడిఒలను పిలిచి, ఆయన టెక్కలి వెళ్లిపోయారు. టెక్కలిలో కలవడానికి వెళ్తే, ఆయన శ్రీకాకుళం వచ్చేశారు. మరోవైపు కలెక్టరేట్‌లోని అన్ని సెక్షన్ల అధికారులు, ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. పనిదినాల్లో రాత్రి పది గంటల వరకు ఉంచడంతో పాటు సెలవు దినాల్లో పనిచేయిస్తున్నారనే కోపం వారిలో గూడు కట్టుకుంది.

సోమవారం వచ్చిదంటే అధికారుల గుండెల్లో రైళ్లు

సోమవారం వచ్చిందంటే చాలు అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. మీకోసం (గ్రీవెన్స్‌)లో ఎవరిపై ఎలా విరుచుకుపడతారోనన్న భయం అధికారులను వెంటాడుతోంది. జెడ్‌పిలో నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌లో అర్జీ రీ ఓపెన్‌ అయితే చాలు పెద్ద కేకలతో విరుచుకుపడుతుండడం చాలాసార్లు తటస్థించింది. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గ్రీవెన్స్‌లో తీసుకొచ్చిన టీ బ్రేక్‌ పద్ధతి అధికారులకు ఇబ్బందిగా మారింది. టీ బ్రేక్‌కు అరగంట నుంచి 45 నిమిషాలు సమయం వృథా కావడంతో గ్రీవెన్స్‌ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి మూడు గంటల వరకు సాగుతోంది. అధికారుల్లో అధికశాతం మంది బిపి, సుగర్‌లతో బాధపడుతుండడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు.

అధికారులకు అవమానం

సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశాల్లో అధికారులను అవమానించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ధాన్యం కొనుగోలుపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన సందర్భంగా సోంపేట ఎంపిడిఒను ఏకంగా నిల్చొబెట్టి అవమానించినట్లు తెలిసింది. దీనిపై ఎంపిడిఒలు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడును కలవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. సిపిఒ కార్యాలయంలో ఓ అధికారి తనకు చెప్పకుండా సెలవు పెట్టి వెళ్లినందుకు ఆ మరుసటి రోజు మధ్యాహ్నం మూడు గంటలకు పిలిచి రాత్రి 12 గంటల వరకు కలెక్టరేట్‌లో ఉంచినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల ఒకటో తేదీన సిఎం చంద్రబాబు జెడ్‌పిలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సిపిఒ కార్యాలయ అధికారులు, ఉద్యోగులు వీడియో, ఆడియో క్లిప్పింగ్‌లను తెప్పించుకోలేకపోయారంటూ వారిని చెడామడా తిట్టినట్లు తెలిసింది. ఇతర అన్ని ప్రభుత్వశాఖల అధికారులకూ నిత్యం ఇదే అనుభవం ఎదురవుతోంది. తమకు అప్పగించిన పని గానీ ఫైల్‌ గానీ తయారు చేయడంలో తప్పు చేస్తే, సరిదిద్దాలే తప్ప కోపం అరిస్తే ఏం ప్రయోజనమని అధికారులు, ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.