ఐదు ఉద్యోగాలు సాధించిన ఏజెన్సీ విద్యార్థి

ఏజెన్సీ ప్రాంతం అనగానే విద్యకు అంత ప్రాధాన్యం ఇవ్వరనే మూఢ నమ్మకం ఒకప్పుడు ఉండేది. సరైన సౌకర్యాలు ఉండవని, ఇంటర్, డిగ్రీ స్థాయిలోనే చదువు నిలిపివేసి ఏదో ఒక పని చేసుకుంటారన్న ఆలోచన ప్రతీ ఒక్కరిలో కలగడం సాధారణం. కానీ మొదటి నుండీ ప్రభుత్వ పాఠశాలలో చదివిన కుస రవికుమార్ అందుకు భిన్నం. నేటికి ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి తాను పుట్టిన ఎదులపల్లి గ్రామానికి, మహబూబాబాద్ జిల్లా ఏజాన్సీ కొత్తగూడ మండలానికి గర్వ కారణంగా నిలిచారు.రాష్ట్రంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రూప్-1 సర్వీసెస్ పరీక్షల్లో విజయం సాధించి, ఎంపీడీవోగా ఎంపిక కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.ఎదుళ్ళపల్లిలో ప్రాథమిక విద్య, సెకండరీ విద్యా ప్రభుత్వ పాఠశాలలో పూర్తి చేసుకున్నారు. అనంతరం కొత్తగూడ లో గల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. వరంగల్ లో బీ టెక్ చేశారు. తెలుగు మీడియం బ్యాక్ గ్రౌండ్ తో ఎటువంటి కోచింగ్ లు లేకుండా కష్టపడి ఐదు ఉద్యోగాలను సాధించినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. మొదటగా 2018లో అసిస్టెంట్ గ్రేడ్ 3 అధికారిగా ఎఫ్.సీ.ఐ లో ఉద్యోగం సాధించారు. అదే ఏడాది గ్రూప్-4 పరీక్షల్లో స్టేట్ 40వ ర్యాంక్ సాధించి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా ఎంపికయ్యారు. 2024లో గ్రూప్-4 పరీక్షల్లో స్టేట్ 98వ ర్యాంక్ సాధించి సబ్ రిజిస్టర్ కార్యాలయాలలో ఉద్యోగం సాధించారు. అదే ఏడాది గ్రూప్-3 పరీక్షల్లో ఎంపికయ్యారు. ప్రస్తుతం డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ నడుస్తోంది. తాజాగా 2025 గ్రూప్-1 పరీక్షల్లో ఎంపీడీవోగా ఎంపికయ్యారు. ఒక్కో దశలో ఒకో విజయాన్ని అందుకుంటూ, ఇప్పుడు రాష్ట్ర స్థాయి ప్రతిష్టాత్మకమైన గ్రూప్-1లో ఎంపీడీఓ గా ఎంపిక కావడం రవికుమార్ జీవితంలోనే మైలురాయిగా తన కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


ఏజెన్సీ ప్రాంతానికి గర్వకారణం : ఎంఈవో, గుమ్మడి లక్ష్మీనారాయణ, జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం ఎదుళ్ళపల్లి

ప్రభుత్వ బడిలో చదివితే ఏమవుతుంది?అన్న వారందరికీ ఎదుళ్ళపల్లి యువకుడు రవికుమార్ ఘనమైన సమాధానం చెప్పారు. తెలుగు మీడియం బ్యాక్‌గ్రౌండ్‌, ఎటువంటి కోచింగ్ లేకుండా, కేవలం కష్టపడి సాధన చేస్తూ వరుసగా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఏజెన్సీ ప్రాంతానికి గర్వకారణంగా నిలిచారు అని అభినందనలు తెలిపారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.