భారత ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేసే ఏఐ

జీడీపీకి అదనంగా రూ.52 లక్షల కోట్లు2035 కల్లా సాధ్యం: నీతి ఆయోగ్‌ నివేదిక


అన్ని రంగాల్లోనూ కృత్రిమ మేధ(ఏఐ)ను అందిపుచ్చుకోవడం పెరుగుతున్నందున 2035 కల్లా భారత జీడీపీకి అదనంగా 500-600 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.44-52 లక్షల కోట్ల) మేర జత అవుతుందని నీతి ఆయోగ్‌ నివేదిక అంచనా వేస్తోంది.

ఏఐ వల్ల ఉత్పాదకత, సిబ్బంది సామర్థ్యం పెరగడం ఇందుకు దోహదం చేస్తుందని అభిప్రాయపడింది. వచ్చే పదేళ్లలో ఏఐ అన్ని విభాగాల్లోనూ దూసుకెళ్లడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 17-26 లక్షల కోట్ల డాలర్లు (దాదాపు రూ.1496-2288 లక్షల కోట్లు) అదనంగా చేరతాయని అంచనా వేసింది.

క్లరికల్‌ ఉద్యోగాలు మాయం?: అంతర్జాతీయ ఏఐ విలువలో భారత్‌ 10-15% వాటాను అందిపుచ్చుకునేందుకు అవకాశాలున్నాయి. ఏఐ వల్ల పలు కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. అయితే క్లరికల్, సాధారణ, తక్కువ నైపుణ్యం ఉండే విభాగాలు మాయం కావొచ్చు. ఆర్థిక సేవలు, తయారీపై ఏఐ ప్రభావం ఎక్కువగా ఉంది. జీడీపీలో ఇవి 20-25% వాటాను అందుకోవచ్చు. ఏఐ కారణంగా ఆర్థిక సేవలు 50-55 బిలియన్‌ డాలర్ల విలువకు చేరుకోవచ్చు. ప్రస్తుత అంచనా (2035పై) కంటే ఇది అధికం.

తయారీ విషయానికొస్తే ఏఐ ఆధారిత ఉత్పాదకత, సామర్థ్యం పెరగడం వల్ల 85-100 బి. డాలర్ల మేర జత కావొచ్చు.

జీడీపీ 8.3 లక్షల కోట్ల డాలర్లకు?: ప్రస్తుత 5.7% వృద్ధి రేటుతో లెక్కవేస్తే 2035 కల్లా 6.6 లక్షల కోట్ల డాలర్లకు భారత జీడీపీ చేరొచ్చు. అదే 8% వృద్ధి అయితే 8.3 లక్షల కోట్ల డాలర్లకు చేరే అవకాశం ఉంది.

టెక్‌ వినూత్నతలకు అనుగుణంగా నియమావళి.. సీతారామన్‌: అందరికీ మంచి చేసే వినూత్నతలు.. ముఖ్యంగా ఏఐలో అవి వచ్చినపుడు వాటిని ఇబ్బంది పెట్టకుండా నియమావళి ఉండాలి. వాటికి మద్దతునిచ్చే నిబంధనలు ఉండాలని నీతి ఆయోగ్‌ రూపొందించిన ఈ నివేదికను విడుదల చేస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యానించారు. ఏఐ ని అందిపుచ్చుకుని, ఒక గొప్ప ప్రభావం చూపడానికి భారత్‌కు మంచి అవకాశం ఉందని టాటా సన్స్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని పరిశ్రమకు సూచించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.