ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్) వల్ల లాభాలు ఎన్నో కానీ ఉద్యోగాలకు మాత్రం ఏఐ ఎసరు పెడుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీలలో ఇప్పటికే భారీగా ఉద్యోగాలు కోతకు గురయ్యాయి.
టీసీఎస్, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇలా పేరు మోసిన కంపెనీల్లో ఇటీవల భారీగా లే ఆఫ్స్ జరిగాయి. కొన్ని కంపెనీలలో ఒకేసారి 12వేల నుండి 15వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇక ఏఐతో మరింత ప్రమాదం పొంచి ఉందని గూగుల్ మాజీ ఉద్యోగి మో గౌదత్ వెల్లడించారు. ఓ పాడ్ కాస్ట్ లో ఆయన మాట్లాడుతూ… 2027 వరకు పరిస్థితులు చాలా మారిపోతాయన్నారు. ఏఐ గణనీయమైన మార్పులు తీసుకువస్తుందని చెప్పారు.
ముఖ్యంగా మధ్యతరగతి పతనానికి ఏఐ దారి తీస్తుందని నమ్ముతున్నా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టాప్ 1శాతంలో లేకపోతే మీరు రైతు అవుతారు, మధ్యతరగతి అనేదే ఉండదు అని చెప్పారు. 2027 నాటికి ఉన్నత విద్యావంతులైన వ్యక్తులు కూడా నిరుద్యోగులుగా మారవచ్చని, దీనివల్ల ప్రస్తుత మధ్యతరగతిపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందన్నారు. 2027 నాటికి ప్రస్తుతం 350 మందితో పనిచేసే స్టార్టప్ కంపెనీలు కేవలం ముగ్గురితో పనిచేస్తాయని చెప్పారు. గతంలో పారిశ్రామికీకరణ కారణంగా మాన్యువల్ స్థానంలో యంత్రాలు వచ్చాయని, ఇప్పుడు విద్యావంతులైన ఉద్యోగుల స్థానంలో ఏఐ ఆటోమేషన్ వస్తుందన్నారు.
































