కార్పొరేట్ కంపెనీల్లో ఏఐ ఇంటర్న్‌షిప్ స్కీం.. అప్లికేషన్లు ఎప్పటి నుంచంటే

www.mannamweb.com


మీరు కూడా ఏఐ ఇంటర్న్‌షిప్ స్కీం కోసం వేచి చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ నిర్వహిస్తున్న ఇంటర్న్‌షిప్ స్కీమ్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ మధ్య నుంచి మొదలు కానున్నట్లు తెలిసింది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.

ఏఐ(AI) ఇంటర్న్‌షిప్ కోసం చూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ నిర్వహిస్తున్న ఇంటర్న్‌షిప్ స్కీమ్(Internship Scheme) కోసం దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ మధ్య నుంచి మొదలు కానున్నట్లు తెలుస్తోంది. మొదటి దశలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ పథకానికి అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు ఆయా వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత కంపెనీలకు ఇంటర్న్‌షిప్ చేయడానికి వచ్చిన జాబితా నుంచి దరఖాస్తుదారులను పంపించనున్నారు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గత మూడేళ్లలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR)పై చేసిన ఖర్చుల ఆధారంగా టాప్ 500 కంపెనీల జాబితాను ఖరారు చేయడంలో బిజీగా ఉంది.

ఈ ఏడాది ప్రారంభం

కంపెనీలు వారి కోరిక మేరకు ఈ పథకంలో చేరవచ్చు. జులై 23న సాధారణ బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఇంటర్న్‌షిప్ పథకాన్ని ప్రకటించారు. ఉపాధిని ప్రోత్సహించడమే దీని లక్ష్యం. కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ చివరి నాటికి ఈ పథకం కోసం పోర్టల్‌ను ప్రారంభించవచ్చు. ఈ విషయానికి సంబంధించి కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. అయితే కంపెనీలు ఎంత మందికి ఇంటర్న్‌షిప్‌ను అందించవచ్చు, ఎంత మంది అప్లై చేసుకునే ఛాన్స్ ఉందనే విషయం పోర్టల్‌ మొదలైన తర్వాత తెలుస్తుంది.

వీరు అప్లై చేసుకోలేరు

దరఖాస్తులను క్రమబద్ధీకరించేటప్పుడు చార్టర్డ్ అకౌంటెంట్లు, సర్టిఫైడ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్లు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) లేదా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) నుంచి డిగ్రీలు పొందిన వ్యక్తులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత లేని అభ్యర్థులుగా మినహాయించబడతారు. దరఖాస్తుదారుడి కుటుంబంలో ఎవరైనా ఆదాయపు పన్ను చెల్లిస్తే లేదా ప్రభుత్వ ఉద్యోగి అయితే, వారు కూడా ఈ పథకానికి అర్హులు కాదు. కంపెనీలు అభ్యర్థులను నేరుగా సంప్రదించలేవని ఆయా వర్గాలు తెలిపాయి.

షార్ట్‌లిస్ట్ చేసి

అభ్యర్థులు ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేసినప్పుడు కమిటీ దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసి కంపెనీలకు పంపుతుంది. ఇంటర్న్ ప్రతి ఖాళీకి ఇద్దరు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. దీని తర్వాత కంపెనీలు తమ అవసరాన్ని బట్టి దరఖాస్తుదారులను ఎంపిక చేసుకోవచ్చు లేదా తిరస్కరించవచ్చని ఆయా వర్గాలు తెలిపాయి. ఇంటర్న్‌షిప్ పథకం ద్వారా 5 సంవత్సరాలలో దేశంలోని అగ్రశ్రేణి కంపెనీలలో 1 కోటి మంది యువత నైపుణ్యం సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద ఎంపికైన యువత 12 నెలల పని అనుభవం పొందుతారు. ఆ క్రమంలో వివిధ వృత్తులను అర్థం చేసుకుంటారు. దీంతో వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అలాంటి అభ్యర్థులకు కేంద్రం ప్రతి నెలా రూ.5,000 స్టైఫండ్ అందజేస్తుంది. దీంతోపాటు వన్‌టైమ్‌ రూ.6,000 ఆర్థిక సాయం కూడా అందజేస్తారు.