3వ తరగతి నుంచే ఏఐ పాఠాలు

  • వచ్చే ఏడాది నుంచి సీబీఎ్‌సఈ బడుల్లో అమలు
  • 3, 4, 5 తరగతుల్లో ప్రాథమిక అంశాలు
  • ఆరో తరగతి నుంచి స్కిల్‌ సబ్జెక్టుగా కొనసాగింపు
  • ఏఐ సాయంతో భాషా నైపుణ్యాల కల్పన కూడా..
  • ఇప్పటికే 18వేల స్కూళ్లలో పైలట్‌ ప్రాజెక్టు
  • కోటి మంది టీచర్లకు ఏఐపై అవగాహన కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు: కేంద్ర విద్యాశాఖ
  • దేశంలో సీబీఎ్‌సఈ విద్యార్థులు ఇకపై మూడో తరగతి నుంచే ‘కృత్రిమ మేధ (ఏఐ)’ పాఠాలు నేర్చుకోనున్నారు. సుమారు 31వేల పాఠశాలల్లో 2026-2027 విద్యా సంవత్సరం నుంచి ఇది అమల్లోకి రానుంది. ఏఐ సాయంతో భాషా నైపుణ్యాలు, గణితం, చాట్‌బోట్‌ ప్రాంప్ట్‌లు, లాంగ్వేజ్‌ మోడల్స్‌, జనరేటివ్‌ ఏఐ వంటి ప్రాథమిక అంశాలను బోధించనున్నారు. చిన్న వయసులోనే టెక్నాలజీ పట్ల అవగాహన పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి సంజయ్‌కుమార్‌ తెలిపారు. ఏఐ పాఠాలు, బోధనకు సంబంధించి ఇప్పటికే పైలట్‌ ప్రాజెక్టు అమలుచేస్తున్నామని, ఇందులో భాగంగా ఉపాధ్యాయులు ఏఐ టూల్స్‌ను వినియోగిస్తున్నారని వెల్లడించారు. 3వ తరగతి నుంచి ఏఐ ప్రాథమిక అంశాల బోధన ఉంటుందని, 6వ తరగతి నుంచి ఏఐ స్కిల్‌ సబ్జెక్టుగా కొనసాగుతుందని తెలిపారు. దేశంలో దాదాపు కోటి మంది ఉపాధ్యాయులు ఉన్నారని, వారందరికీ ఏఐ టెక్నాలజీపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.