ప్రయోగాలు చేస్తున్న గుంటూరు సంస్థరెండు, మూడు సీట్లతో ఎగిరే వాహనాలు
తొలిదశ ప్రయోగాలు విజయవంతం
‘మ్యాగ్నమ్ వింగ్స్’ సంస్థ రూపొందించిన ఎయిర్‌ట్యాక్సీ
ఈనాడు, అమరావతి: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎయిర్ ట్యాక్సీలను పట్టణాలు, నగరాల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. చైనా వంటి దేశాలు మాత్రమే ఈ రేసులో ముందు ఉన్న నేపథ్యంలో గుంటూరుకు చెందిన ఓ యువకుడు ఆయా దేశాలతో పోటీ పడుతూ ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. ‘మ్యాగ్నమ్ వింగ్స్’ సంస్థను ఏర్పాటు చేసి ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. మోటర్లు మినహా మిగతా పరికరాలన్నీ మేడిన్ ఆంధ్రప్రదేశ్ కావడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత.
2019 నుంచి ప్రయోగాలు..
గుంటూరుకు చెందిన చావా అభిరాం అమెరికాలో రోబోటిక్స్ ఇంజినీరింగ్, మాస్టర్స్ పూర్తి చేశారు. మన దేశంలోనే ఏదైనా సంస్థ ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడకు వచ్చేశారు. ట్రాఫిక్‌తో సతమతమవుతున్న ఇక్కడి నగరాల్లో ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తీసుకొస్తే ఉపయోగకరమని భావించి బాగా అధ్యయనం చేశారు. దేశ, విదేశాల్లో ఎయిర్ ట్యాక్సీల రంగంలో జరుగుతున్న పరిశోధనలను పరిశీలించారు. అనంతరం 2019లో గుంటూరు శివారులోని నల్లచెరువులో ‘మ్యాగ్నమ్ వింగ్స్’ సంస్థను ఏర్పాటు చేసి చిన్న ఎయిర్ ట్యాక్సీని తయారుచేశారు. పైలట్ లేకుండా భూమి మీద నుంచే నియంత్రించేలా రూపొందించిన ఆ వాహనాన్ని విజయవంతంగా ప్రయోగించారు. పైలట్ లేని ఈ వాహనాలను డీజీసీఏ అనుమతించదు కాబట్టి.. పైలట్ కూడా ఉండేలా రెండు సీట్లు, మూడు సీట్లతో ఎయిర్ ట్యాక్సీలు తయారు చేస్తున్నారు. పూర్తిగా దేశీయ ఉపకరణాలతోనే ప్రాజెక్టులు చేస్తున్నారు. రెండు సీట్లతో కూడిన ఎయిర్ ట్యాక్సీని రూపొందించి వీ2 అని పేరు పెట్టారు. దీని ప్రయోగం విజయవంతం కావడంతో రెండో వెర్షన్ తయారీలో నిమగ్నమయ్యారు. మూడు సీట్లతో కూడిన ఎక్స్-4 మోడల్‌ను మరో నెలరోజుల్లో పరిశీలించనున్నారు.
క్యాబ్ ఖర్చుతోనే ఎయిర్‌ట్యాక్సీ ప్రయాణం..
వీ2 రకం గరిష్ఠంగా 40 కి.మీ. ప్రయాణిస్తుంది. 1,000 అడుగుల ఎత్తులో ప్రయాణించే దీని గరిష్ఠ వేగం 100 కి.మీ. ఎక్స్-4 ఎయిర్ ట్యాక్సీ 300 కి.మీ. దూరాన్ని 20 వేల అడుగుల ఎత్తులో 300 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. దూర ప్రయాణాలకు ఇది ఉపకరిస్తుంది. మార్కెట్‌లోకి వచ్చేటప్పటికి వీ2 మోడల్ ధర రూ.2 కోట్లు, ఎక్స్-4 రకం రూ.8 కోట్లు ఉండొచ్చని అభిరామ్ తెలిపారు. క్యాబ్ ఖర్చుతోనే ఎయిర్ ట్యాక్సీలో ప్రయాణం అందుబాటులోకి తీసుకురావాలనేది తన లక్ష్యమని వెల్లడించారు. తమ వాహనాలు బ్యాటరీ సహాయంతో నడుస్తాయని, ఆకాశమార్గంలో దూరం తక్కువగా ఉండటం వల్ల నిర్వహణ ఖర్చు పెద్దగా ఉండదని వివరించారు.
డ్రాఫ్టింగ్ దశలోనే ఎయిర్ ట్యాక్సీ పాలసీ
మనదేశంలో బెంగళూరు, చెన్నై తదితర నగరాల్లో కూడా ఎయిర్‌ట్యాక్సీలపై ప్రయోగాలు చేస్తున్నారు. ఎయిర్ ట్యాక్సీ పాలసీ ఇంకా డ్రాఫ్టింగ్ దశలోనే ఉంది. విధి విధానాలు అందుబాటులోకి వస్తే అనుమతుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. తదనంతరం వీటిని అందుబాటులోకి తీసుకురావడానికి వీలవుతుంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి మూడేళ్లు పడుతుందని అభిరామ్ తెలిపారు. మ్యాగ్నమ్ వింగ్స్ ద్వారా ఎయిర్ ట్యాక్సీ సేవలను అందించడమే కాకుండా కావాలనుకున్నవారికి వాటిని విక్రయిస్తామని పేర్కొన్నారు.