అదానీ గ్రూప్.. బ్రెజిల్ ఏరోస్పేస్ కంపెనీ ఎంబ్రాయర్‌తో జట్టు కట్టింది.
మన దేశంలో విమానాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పే్‌సతో ఎంబ్రాయర్ అవగాహన ఒప్పం దం (ఎంఓయూ) కుదుర్చుకుంది. పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు సమక్షంలో మంగళవారం ఈ ఒప్పందం జరిగింది. విమానయాన రంగంలో మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలకు ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ఊతమివ్వనుంది. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్లలో ఒకటైన భారత్‌లో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విమాన సేవలు మరింత పెరిగేందుకూ తోడ్పడనుంది. దేశీయ విమాన రంగంలో ఈ ఒప్పందం కీలక మైలురాయి అని మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ ఎంఓయూలో భాగంగా ఎంబ్రాయర్ ప్రయాణికుల విమానాల తయారీకి అవసరమైన ఫైనల్ అసెంబ్లింగ్ లైన్‌ను అదానీతో కలిసి భారత్‌లో ఏర్పాటు చేయనుంది. ఇక్కడ విడిభాగాలన్నింటినీ కూర్చి పూర్తి విమానాన్ని తయారుచేస్తారు. 70 నుంచి 146 సీట్ల వరకు సామర్థ్యంతో కూడిన ఎంబ్రాయర్ రీజినల్ జెట్ విమానాలు స్వల్ప, మధ్య స్థాయి దూర మార్గాల్లో ప్రయాణించేందుకు పనికొస్తాయి. ఏపీలోని భోగాపురం లేదా గుజరాత్‌లోని ధోలేరాలో ఈ ప్లాంట్ ఏర్పాటు చేసే అవకాశాలున్నట్టు కొందరి కథనం.
భారత్‌లో తొలి యూనిట్.. : ఫిక్స్‌డ్ వింగ్ ప్రయాణికుల విమానాల తయారీకి సంబంధించి దేశంలో ఇదే తొలి అసెంబ్లింగ్ యూనిట్ కానుంది. ఈ ప్రతిపాదిత ఎఫ్‌ఏఎల్‌ను ఎక్కడ ఏర్పాటు చేస్తారు, పెట్టుబడులెంత… ఎప్పటికి అందుబాటులోకి వస్తుంది..? వంటి వివరాలను మాత్రం వెల్లడించలేదు. ప్లాంట్ ఏర్పాటుకు సరైన స్థలం కోసం అన్వేషణ జరుగుతున్నదని, మరికొద్ది నెలల్లో ఓ నిర్ణయానికి రావచ్చని అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ డైరెక్టర్ జీత్ అదానీ అన్నారు.
ఇండియాపై ఎంబ్రాయర్ ఫోకస్: భారత విమానయాన మార్కెట్లోని అపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఎంబ్రాయర్ గత ఏడాది అక్టోబరులోనే ఢిల్లీలో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. కంపెనీకి చెందిన ఈ-జెట్ విమానాలు 2005లోనే భారత్‌లోకి ప్రవేశించాయి. దాదాపు 50 విమానాలు భారత వైమానిక దళం, ప్రభుత్వ ఏజెన్సీలు, బిజినెస్ జెట్ ఆపరేటర్లతోపాటు వాణిజ్య ఎయిర్‌లైన్ స్టార్ ఎయిర్‌కు సేవలందిస్తున్నాయి.
విమానాశ్రయాల నిర్వహణ నుంచి
విమానాల తయారీ వరకు..
ఇప్పటికే ఎయిర్‌పోర్ట్‌ల అభివృద్ధి, నిర్వహణ, విమానాల ఎంఆర్‌ఓ (నిర్వహణ, మరమ్మతు, సర్వీసింగ్), పైలట్ల శిక్షణ విభాగాల్లోకి ప్రవేశించిన అదానీ గ్రూప్ ఈ ఒప్పందంతో విమానాల తయారీలోకీ అడుగుపెట్టింది. ఈ భాగస్వామ్యం ద్వారా ఎయిర్‌క్రా్‌ఫ్టల తయారీతోపాటు సప్లై చెయిన్, ఆఫ్టర్ మార్కెట్ సర్వీసెస్, పైలట్ ట్రైనింగ్ విభాగాల్లోనూ కలిసి పనిచేయాలని అదానీ, ఎంబ్రాయర్ భావిస్తున్నాయి.


































