శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి శరవేగంగా అడుగులు

www.mannamweb.com


శ్రీకాకుళం జిల్లాలో (Srikakulam District) విమానాశ్రయ నిర్మాణం కోసం వేగంగా అడుగులు పడుతున్నాయి. అవసరమైన వనరులు సమకూర్చేందుకు జిల్లా అధికార యంత్రాంగం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. తొలి దశలో అనుకూలమైన ప్రాంతంతో పాటు భూముల కేటాయింపులకు రెవెన్యూ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం, పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌నాయుడు ఆదేశాల మేరకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) అధికార బృందం గురువారం పర్యటించింది. పలాస ఆర్డీవో వెంకటేశ్, మందస, వజ్రపుకొత్తూరు మండలాల తహసీల్దార్లు హైమావతి, సీతారామయ్య అధికారుల బృందాలతో కలిసి స్థల పరిశీలన చేశారు.

అదే బెస్ట్ ప్లేస్

మందస మండలం బేతాళపురం, లక్ష్మీపురం, బిడిమి, వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు, చీపురుపల్లి పంచాయతీ పరిధిలోని గుర్తించిన 1383.98 ఎకరాల వివరాలు తెలుసుకున్నారు. మందస, వజ్రపుకొత్తూరు మండలాల పరిధిలోని ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి భౌగోళిక, సామాజిక అంశాల పరంగా సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. విమానాశ్రయ ప్రతిపాదిత ప్రాంతానికి ఓ వైపు కొండలు ఉండగా.. మరోవైపు సముద్రం, రైలు నిలయం, జాతీయ రహదారి ఉన్నాయి. దీంతో పాటు సమీపంలో మూలపేట పోర్టు అందుబాటులోకి వస్తే వాణిజ్యపరంగా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

అధికారుల పర్యటన సాగిందిలా..

అధికారుల బృందం తొలుత మందస మండలం గంగువాడ, బేతాళపురం, లక్ష్మీపురం, బిడిమి మీదుగా వజ్రపుకొత్తూరు మండలం అనకాపల్లి, ఒంకులూరు పరిసర ప్రాంతాల్లో పర్యటించింది. సహజ వనరులు, ప్రభుత్వ, జిరాయితీ భూములు, నివాస గృహాలు, జనాభా గణాంకాలను పరిశీలించారు. రెవెన్యూ, భూగర్భజల, మైనింగ్, జలవనరుల శాఖ అధికారుల నుంచి సమగ్ర వివరాలు ఆరా తీశారు. ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సంబంధిత సానుకూల అంశాలు, సాధ్యాసాధ్యాలపై జిల్లా అధికార యంత్రాంగంతో చర్చించారు. వీటిపై పూర్తి నివేదికలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిర్మాణానికి చర్యలు చేపట్టనున్నట్లు ఏఏఐ బృంద సభ్యులు తెలిపారు. ఎయిర్‌పోర్ట్ నిర్మాణం పూర్తైతే శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడినట్లేనని జిల్లా వాసులు అభిప్రాయపడుతున్నారు.