ఇండియన్ టెలికాం కంపెనీలు ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టార్స్‌పై ఫోకస్ పెంచుతున్నాయి. భారత టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ (Bharti Airtel), ఆర్థిక సేవలను అందించేందుకు సిద్ధమైంది.
ఇందుకు తాజాగా బజాజ్ ఫైనాన్స్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ పార్ట్నర్‌షిప్‌లో భాగంగా, ఎయిర్‌టెల్ కంపెనీ తమ కస్టమర్లకు బజాజ్ ఫైనాన్స్ రిటైల్ ఫైనాన్షియల్ ప్రొడక్టులను సొంత ప్లాట్‌ఫారమ్స్‌లో అందించనుంది. ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ (Airtel Thanks App), దేశవ్యాప్తంగా ఉన్న స్టోర్‌లలో కస్టమర్లకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది.
* పార్ట్‌నర్‌షిప్ బెనిఫిట్స్
ప్రస్తుతానికి ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌లో బజాజ్ ఫైనాన్స్‌కు సంబంధించిన రెండు ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అందిస్తారు. కస్టమర్లు యాప్ నుంచే బజాజ్ ఫైనాన్స్ గోల్డ్ లోన్లు, ఈఎంఐ కార్డులు పొందవచ్చు. ఈ ఏడాది మార్చి నాటికి ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లో బజాజ్ ఫైనాన్స్‌కు చెందిన బిజినెస్ లోన్, పర్సనల్ లోన్ సహా నాలుగు ఫైనాన్షియల్ ప్రొడక్టులు అందుబాటులోకి వస్తాయి. ఈ సంవత్సరంలోనే ప్లాట్‌ఫారమ్ 10 విభిన్న ఫైనాన్షయల్ ప్రొడక్టులు అందించే లక్ష్యంతో పని చేస్తోంది.
*బజాజ్ ఫైనాన్స్ సేవలు..
ఈ ఒప్పందంతో ఎయిర్‌టెల్ కంపెనీకి ఉన్న 375 మిలియన్ల కస్టమర్లు, బజాజ్ ఫైనాన్స్ సేవలను సురక్షితంగా, సౌకర్యవంతంగా యాక్సెస్ చేయవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న 12 లక్షల ఎయిర్‌టెల్ స్టోర్లలో కూడా ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.
* వన్‌స్టాప్ డెస్టినేషన్
ఈ పార్ట్‌నర్‌షిప్, ఎయిర్‌టెల్ కస్టమర్ బేస్‌తో పాటు ఆర్థిక సేవలలో బజాజ్ ఫైనాన్స్ నైపుణ్యాన్ని కంబైన్ చేస్తుంది. బజాజ్ ఫైనాన్స్ కంపెనీ ఇప్పటికే 27 ఫైనాన్షియల్ ప్రొడక్టులు అందిస్తోంది. 5,000 వేలకు పైగా బ్రాంచ్‌లను నిర్వహిస్తోంది. దాదాపు 70,000 ఫీల్డ్ ఏజెంట్లు పని చేస్తున్నారు. దేశంలో ఫైనాన్షియల్ సర్వీసులు అందించే అతపెద్ద సంస్థల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు ఎయిర్‌టెల్ భాగస్వామ్యంతో కస్టమర్ బేస్‌ని మరింత పెంచుకోనుంది.
కస్టమర్ల అవసరాలు తీర్చడానికేనని ప్రకటన..
బజాజ్ ఫైనాన్స్‌తో ఒప్పందంపై ఎయిర్‌టెల్ ఎండీ గోపాల్ విట్టల్ మాట్లాడారు. ఈ పార్ట్నర్‌షిప్, ఆర్థిక సేవల పరిధిని పెంచుతుందని, లక్షల మంది భారతీయుల విభిన్న అవసరాలను తీరుస్తుందని చెప్పారు. ఫైనాన్షియల్ సొల్యూషన్స్‌కి ఎయిర్‌టెల్ ఫైనాన్స్‌ను వన్-స్టాప్ షాప్‌గా మార్చడమే తమ లక్ష్యమని తెలిపారు. భారతదేశంలో పెరుగుతున్న డిజిటల్ ఫైనాన్స్ ఎకోసిస్టమ్‌కి రెండు బ్రాండ్‌ల పార్ట్‌నర్‌షిప్ సహకరిస్తుందని బజాజ్ ఫైనాన్స్ కంపెనీ ఎండీ రాజీవ్ జైన్ తెలిపారు.
* కస్టమర్లకు బెనిఫిట్స్
ఇప్పుడు ఎయిర్‌టెల్ కస్టమర్లు ఎయిర్‌టెల్-బజాజ్ ఫిన్‌సర్వ్ ఇన్‌స్టా ఈఎంఐ (Airtel- Bajaj Finserv Insta EMI) కార్డ్ కోసం ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ లేదా ఇన్-స్టోర్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కార్డ్ 4,000+ నగరాల్లోని 1.5 లక్షల పార్టనర్ స్టోర్‌ల నుంచి ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, కిరాణా సామాగ్రి, మరిన్నింటిని ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తుంది. ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో ఆన్‌లైన్ షాపింగ్ కోసం కూడా కార్డును ఉపయోగించవచ్చు.