ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) 2024 (జులై) పరీక్షలు సమీపిస్తున్నాయి. అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు టెట్ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో జరగనున్నాయి. రోజుకు రెండు సెషన్ల చొప్పున దాదాపు 18 రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం మొదటి సెషన్ 9.30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం రెండో సెషన్ 2.30 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. ఈ మేరకు పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. టెట్‌కు సంబంధించిన హాల్‌టికెట్లు సెప్టెంబర్ 22 తర్వాత అందుబాటులో రానున్నట్లు ఇప్పటికే విద్యాశాఖ స్పష్టం చేసింది. పరీక్ష ముగిసిన ఒక రోజు తర్వాత అంటు అక్టోబర్ 4 తర్వాత నుంచి ఆ ముందు రోజుల ప్రాథమిక ‘కీ’లు వరుసగా విడుదల కానున్నాయి. అక్టోబర్ 5 నుంచి కీపై అభ్యంతరాల స్వీకరిస్తారు. అక్టోబర్ 27వ తేదీ తుది ఆన్సర్ ‘కీ’ విడుదల అవుతుంది. నవంబర్ 2న టెట్ ఫలితాలు ప్రకటిస్తారు. కమ్యూనిటీ వారీ ఉత్తీర్ణతా మార్కులు.. ఓసీ (జనరల్) కేటగిరీలో 60 శాతం ఆపైన మార్కులు, బీసీ కేటగిరీలో 50 శాతం మార్కులు ఆపైన, ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్/ ఎక్స్ సర్వీస్‌మెన్ కేటగిరీల వారికి 40 శాతం మార్కులు ఆపైన వస్తేనే టెట్‌లో ఉత్తీర్ణత సాధించినట్లు పరిగణిస్తారు.
కాగా ఆంధ్రప్రదేశ్ టెట్‌కు ఆగస్టు 3వ తేదీతో దరఖాస్తు ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకున్నారు. సెకండరీ గ్రేడ్ టీచర్‌కు పేపర్ 1-ఎకు 1,82,609 మంది దరఖాస్తు చేసుకున్నారు. సెకెండరీ గ్రేడ్‌టీచర్ స్పెషల్ ఎడ్యుకేషన్ పేపర్ 1 బికు 2,662 మంది చొప్పున దరఖాస్తులు వచ్చాయి. ఇక స్కూల్ అసిస్టెంట్ టీచర్ పోస్టులకు అర్హత పరీక్ష అయిన పేపర్ 2-ఎ లాంగ్వేజెస్‌కు 64,036 మంది దరఖాస్తు చేసుకోగా.. మ్యాథ్స్ అండ్ సైన్స్‌కు అత్యధికంగా 1,04,788 మంది అప్లై చేసుకున్నారు. ఈసారి మెగా డీఎస్సీలో పోస్టుల సంఖ్య అత్యధికంగా ఉండటంతో పోటీపడే వారి సంఖ్య భారీగా పెరిగింది. రాష్ట్రంలో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి టెట్ తర్వాత మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకానుంది.
నిజానికి, ఈ ఏడాది జులై 2వ తేదీన టెట్ నోటిఫికేషన్ ఇచ్చిన విద్యాశాఖ ఆగస్టు 3 వరకు దరఖాస్తులు స్వీకరించింది. అలాగే పరీక్షల సన్నద్ధతకు కూడా మరింత సమయం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో దాదాపు 3 నెలల గడువు ఇస్తున్నట్లు ప్రకటించింది. పాత నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 5 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు జరగాల్సి ఉంది. డీఎస్సీలో టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఉండటంతో ఈ పరీక్షలో స్కోరు పెంచుకొనేందుకు ఈసారి భారీగా పోటీపడుతున్నారు.