బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌: మే నెలలో మారుతున్న రూల్స్‌

www.mannamweb.com


ఏప్రిల్‌ నెల ముగింపునకు వచ్చేసింది. త్వరలో మే నెల ప్రారంభం కాబోతోంది. ప్రతి నెలా మాదిరిగానే మే నెల ప్రారంభం నుంచి కొన్ని ఆర్థిక నియమాలు మారబోతున్నాయి.
ముఖ్యంగా కొన్ని బ్యాంకులకు సంబంధించి మే నెలలో మారబోతున్న నియమాలు ఏంటో ఈ కథనంలో​ తెలుసుకుందాం.

యస్ బ్యాంక్ రూల్స్‌
యస్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం.. మే 1 నుంచి, వివిధ రకాల పొదుపు ఖాతాల కనీస సగటు నిల్వ (Minimum Average Balance) మారుతుంది. యస్ బ్యాంక్ ప్రో మాక్స్‌ మినిమమ్‌ యావరేజ్‌ బ్యాలెన్స్ (MAB) రూ. 50,000గా మారుతుంది. దీనిపై గరిష్ట రుసుమును రూ. 1000గా నిర్ణయించారు. ప్రో ప్లస్ పొదుపు ఖాతాలలో కనీస సగటు నిల్వ పరిమితిని రూ. 25,000గా సవరించారు. ఈ ఖాతాకు గరిష్ట రుసుమును రూ. 750గా నిర్ణయించారు. బ్యాంక్ అకౌంట్‌ ప్రోలో కనీస నిల్వ రూ. 10,000. దీనిపై గరిష్ట రుసుము రూ. 750గా మారింది.
ఐసీఐసీఐ బ్యాంక్ రూల్స్‌
ఐసీఐసీఐ బ్యాంక్ చెక్ బుక్, ఐఎంపీఎస్‌, ఈసీఎస్‌ / ఎన్‌ఏసీహెచ్‌ డెబిట్ రిటర్న్స్, స్టాప్ పేమెంట్ ఛార్జీలు, మరిన్నింటితో సహా కొన్ని సేవల సేవింగ్స్ ఖాతా సర్వీస్ ఛార్జీలను సవరించింది. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం ఈ మార్పులు మే 1 నుండి అమలులోకి వస్తాయి.
డెబిట్ కార్డ్‌ వార్షిక రుసుములు ఇక నుంచి గ్రామీణ ప్రాంతాల్లో రూ. 99, పట్టణ ప్రాంతాల్లో రూ. 200 ఉండనున్నాయి. చెక్‌ బుక్‌ విషయానికి వస్తే 25 లీఫ్స్‌ వరకు ఎలాంటి ఛార్జ్‌ ఉండదు. ఆపైన ఒక్క చెక్‌ లీఫ్‌కు రూ.4 చొప్పున చెల్లించాలి. డీడీ క్యాన్సిలేషన్‌, డూప్లికేట్‌, రీవ్యాలిడేషన్‌ను చార్జీలను రూ.100లుగా బ్యాంక్‌ సవరించింది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్పెషల్‌ ఎఫ్‌డీ స్కీమ్‌
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్‌ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీనియర్ సిటిజన్‌ల కోసం అమలు చేస్తున్న “హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీనియర్ సీటిజన్ కేర్ ఎఫ్‌డీ” గడువును మే 10 వరకు పొడిగించింది. ఈ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకం కింద, సీనియర్ సిటిజన్లకు 0.75 శాతం అధిక వడ్డీ రేటును బ్యాంక్‌ అందిస్తోంది. 5 – 10 సంవత్సరాల కాలపరిమితి ఎఫ్‌డీపై ఇన్వెస్టర్లకు 7.75 శాతం వడ్డీ అందుతుంది. ఈ పథకం కింద, సీనియర్ సిటిజన్లు రూ. 5 కోట్ల వరకు డిపాజిట్ చేయొచ్చు.

బ్యాంక్‌లకు సెలవులు
వచ్చే మే నెలలో ఆదివారాలు, రెండో, నాలుగో నాలుగు శనివారాలు, వివిధ పండుగలు, ఇతర సందర్భాల కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు 12 రోజులు సెలవులు వచ్చాయి. ఈ సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారతాయి. ఈ 12 రోజుల్లో రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలు కూడా కలిసి ఉన్నాయి.