మెగా డీఎస్సీ రాసిన వారిలో ఎక్కువ మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్(పీజీ) చదివిన వారే ఉన్నారు. మొత్తం అభ్యర్థుల్లో 89.64 శాతం మంది పీజీ చేసినవారు ఉన్నట్టు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. మెగా డీఎస్సీకి 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 3,01,493 మంది పీజీ చేశారు. అభ్యర్థులు నమోదు చేసిన వివరాల ఆధారంగా విద్యార్హతలను పాఠశాల విద్యాశాఖ విశ్లేషించింది. అభ్యర్థుల్లో అత్యధికంగా 1,61,374 మంది ఎంఏ విద్యార్హత కలిగినవారున్నారు. ఆ తర్వాత ఎమ్మెస్సీ చదివినవారు 1,09,864 మంది, ఇతర పీజీ కోర్సులు చేసినవారు 14,005 మంది, బీటెక్ చదివినవారు 7,378 మంది, రెండేళ్ల పీజీ చేసినవారు 2,203 మంది, మూడేళ్ల పీజీ చదివినవారు 139 మంది, ఎంకామ్ చేసినవారు 6,282 మంది, ఎమ్మెస్సీ టెక్నాలజీ చదివినవారు 248 మంది ఉన్నారు. రాష్ట్రంలో చివరిగా 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వైసీపీ ప్రభుత్వం ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదు. ఏడేళ్ల తర్వాత ప్రస్తుత ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించింది. దీంతో చాలాకాలంగా డీఎస్సీ కోసం ఎదురుచూస్తూ విద్యార్హతలు పెంచుకున్న నిరుద్యోగులు డీఎస్సీలో భారీగా పోటీపడ్డారు. చివరికి సాఫ్ట్‌వేర్ వైపు ఆసక్తి చూపే ఇంజనీరింగ్ అభ్యర్థులు కూడా బీఈడీ చదివి డీఎస్సీ పరీక్షలు రాశారు. డీఎస్సీలో ఎక్కువ మంది విద్యాధికులే కావడంతో కొత్త టీచర్లతో ప్రభుత్వ పాఠశాలల్లో బోధనలో నాణ్యత పెరిగే అవకాశం ఉందని పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. వాస్తవానికి డీఎస్సీలో ఎక్కువ శాతం ఉద్యోగాలకు ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్హతే ప్రాతిపదిక. సెకండరీ గ్రేడ్ టీచర్(ఎ్‌సజీటీ) పోస్టులకు ఇంటర్మీడియట్‌తో పాటు డీఈడీ ఉండాలి. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల(ఎ్‌సఏ)కు డిగ్రీతో పాటు బీఈడీ ఉండాలి. 273 పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్, ప్రిన్సిపాల్ పోస్టులు 52 ఉన్నాయి. వీటికి మాత్రమే పీజీ అవసరం ఉంది. అయినా ఎస్జీటీకి దరఖాస్తు చేసుకున్నవారిలోనూ ఎక్కువ మంది పీజీ చదివినవారే ఉన్నారు. మొత్తంగా 10శాతం మంది మాత్రమే డీగ్రీ, ఇంటర్మీడియట్ చదివిన అభ్యర్థులు మెగా డీఎస్సీలో పరీక్షలు రాశారు. వీరిలోనూ ఇంటర్మీడియట్ విద్యార్హతతో రాసిన వారు స్వల్పంగా ఉన్నారని అధికార వర్గాలు తెలిపాయి.
ఒక్కొక్క పోస్టుకు 35 మంది పోటీ.. డీఎస్సీకి 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సగటున ఒక్కొక్క పోస్టుకు 35 దరఖాస్తులు అందాయి. మొత్తం అభ్యర్థుల్లో 1.31 లక్షల మంది పురుషులు, 2.03 లక్షల మంది మహిళలు ఉన్నారు. ఉద్యోగాలకు గరిష్ఠ వయోపరిమితిని పెంచడం కూడా విద్యాధికులు ఎక్కువ మంది పోటీ పడేలా చేసింది. రాష్ట్ర విభజన అనంతరం భారీ సంఖ్యలో డీఎస్సీ ప్రకటించడం ఇదే తొలిసారి. దీంతో ఉద్యోగం పొందే అవకాశం ఎక్కువగా ఉందని భావించిన అభ్యర్థులు డీఎస్సీలో పోటీపడ్డారు.
































