Allam Chutney : అల్లం మన శరీరానికి ఎంతో ఉపయోగకరం.. దాంతో చట్నీని ఇలా తయారు చేయండి..!

www.mannamweb.com


Allam Chutney : మనం కూరలను తయారు చేయడానికి ఉపయోగించే వాటిల్లో అల్లం ఒకటి. ఎక్కువగా మనం అల్లాన్ని.. వెల్లుల్లితో కలిపి పేస్ట్ లా చేసి ఆ మిశ్రమాన్ని కూరల్లో వాడుతూ ఉంటాం.

అల్లాన్ని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అల్లం జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. తల తిరగడాన్ని తగ్గిస్తుంది. అల్లం యాంటీ బాక్టీరియల్ పదార్థంగా కూడా పని చేస్తుంది. ఆర్థరైటిస్ వల్ల కలిగే నొప్పులను తగ్గించడంలో అల్లం ఎంతో సహాయపడుతుంది. మహిళల్లో నెలసరి సమయంలో వచ్చే నొప్పులను తగ్గించడంలో కూడా అల్లం ఉపయోగపడుతుంది. అల్లాన్ని తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల క్యాన్సర్, అల్జీమర్స్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

గుండె పని తీరును మెరుగుపరచడంలోనూ అల్లం దోహదపడుతుంది. అల్లంతో టీ ని కూడా తయారు చేస్తూ ఉంటాం. అల్లంతో తయారు చేసే ఆహార పదార్థాలలో అల్లం చట్నీ ఒకటి. అల్లం చట్నీ చాలా రుచిగా ఉంటుంది. అల్లం చట్నీని ఎక్కువగా ఇడ్లీ, దోశ వంటి వాటిని తినడానికి ఉపయోగిస్తూ ఉంటాం. హోటల్స్ లో అల్లం చట్నీని ఎంతో రుచిగా తయారు చేస్తూ ఉంటారు. హోటల్స్ లో తయారు చేసే విధంగా మనం ఇంట్లో కూడా అల్లం చట్నీని తయారు చేసుకోవచ్చు. అల్లం చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో.. ఎలా తయారు చేయాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.

అల్లం చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..

అల్లం ముక్కలు – 20 గ్రా., చింతపండు – 15 గ్రా., బెల్లం తురుము – 10 గ్రా., శనగ పప్పు – ఒక టేబుల్ స్పూన్‌, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్‌, ఎండు మిర్చి – 50 గ్రా., నూనె – ఒక టీ స్పూన్‌, ఉప్పు – రుచికి సరిపడా, నీళ్లు – తగినన్ని.

అల్లం చట్నీ తయారీ విధానం..

ముందుగా చింతపండును నీటిలో నానబెట్టుకోవాలి. కళాయిలో నూనె వేసి కాగాక ఎండు మిర్చి వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఇవి వేగాక ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో అల్లం ముక్కలు, ధనియాలు, శనగపప్పు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక జార్ లో ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు మిరపకాయలను వేసి మిక్సీ పట్టుకోవాలి. అందులోనే నానబెట్టిన చింతపండు, బెల్లం తురుము, రుచికి సరిపడా ఉప్పు, ముందుగా వేయించి పెట్టుకున్న అల్లం ముక్కలు, ధనియాలు, శనగ పప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లను పోసి మళ్లీ మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే అల్లం చట్నీ తయారవుతుంది. ఇడ్లీ , దోశ వంటి వాటితోనే కాకుండా అన్నంతో కూడా అల్లం చట్నీని కలిపి తినవచ్చు. ఇలా తరచూ అల్లం చట్నీని తయారు చేసుకుని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.