శాంతి నియామకంపైనే ఆరోపణలు.. విచారణ జరుగుతోంది: ఆనం

www.mannamweb.com


శాంతి నియామకంపైనే ఆరోపణలు.. విచారణ జరుగుతోంది: ఆనం

అమరావతి: దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్‌గా శాంతి నియామకంపైనే ఆరోపణలు ఉన్నాయని, వాటిపై విచారణ జరుగుతోందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ లాబీలో చిట్ చాట్‌గా ఆయన మాట్లాడారు. ఆమె నియామకం అక్రమమని తేలితే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతి నియామకం జరిగినప్పుడు ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు ఏపీపీఎస్సీలో కీలకంగా ఉన్నారని, ఒక వేళ నియామకంలో తప్పులు జరిగితే ఆయన కూడా బాధ్యులవుతారని అన్నారు. శాఖాపరమైన విచారణ ముగిసి, తగిన ఆధారాలు సేకరించాక ఏపీపీఎస్సీని వివరణ కొరతామన్నారు.

శాంతి విశాఖలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు వివాదాస్పద చర్యలకు పాల్పడినట్లు ఫిర్యాదులు ఉన్నాయని వెల్లడించారు. ప్రేమ సమాజం, ఇతర భూముల విషయంలో ఆమెపై ఉన్న అనేక ఆరోపణలపైనా విచారణ జరుగుతోందని ఆనం తెలిపారు. విశాఖ భూదందా వివాదాల్లో శాంతితో పాటు సుభాష్ పాత్ర కూడా ఉన్నట్లు వచ్చిన ఫిర్యాదులపైనా విచారణ జరుగుతోందన్నారు. అన్ని ఆధారాలను ఏదో ఒకరోజు అసెంబ్లీ ముందుంచుతామన్నారు. పులిచింతల ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో 46 ఆలయాలు పునర్నిర్మాణం చేయాల్సి ఉందని, ఇందుకు రూ.36 కోట్ల పరిహారం నిధులు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఆలయ నిర్మాణాలు జరిగితే నిధులు విడుదల అవుతాయని ఆనం స్పష్టం చేశారు.