హైదరాబాద్: థియేటర్ తనకు గుడిలాంటిదని, అక్కడ ప్రమాదం జరగడం నిజంగా బాధగా ఉందని సినీ నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) అన్నారు. పోలీసులు, అధికారులు అందరూ కష్టపడి పనిచేసినా, సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు. తనపై చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని తెలిపారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై శనివారం సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా మాట్లాడారు. అల్లు అర్జున్‌ను థియేటర్‌కు రావొద్దని పోలీసులు చెప్పినా వినకుండా వచ్చారని అన్నారు. బాధిత కుటుంబాన్ని కనీసం ఏ ఒక్క సినీ ప్రముఖుడూ పరామర్శించలేదని మండిపడ్డారు. సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో అల్లు అర్జున్ (Allu Arjun Press Meet) విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తన వ్యవహారశైలిపై వచ్చిన వార్తలను అల్లు అర్జున్ ఖండించారు. తన క్యారెక్టర్‌ను తక్కువ చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు.
‘‘ నాపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలే. నేను ఎలాంటి ర్యాలీ చేయలేదు. థియేటర్‌కు కొద్ది దూరంలో నా కారు ఆగిపోయింది. కారు ముందుకు కదల్లేదు. చేయి చూపిస్తూ ముందుకు కదలండని పోలీసులు అంటేనే నేను బయటకు వచ్చి, చేతులు ఊపాను. థియేటర్ లోపలికి వచ్చిన తర్వాత ఏ పోలీస్ లోపలికి వచ్చి జరిగిన సంఘటన గురించి చెప్పలేదు. ఆ తర్వాత కొద్దిసేపటికి థియేటర్ యాజమాన్యం వచ్చి, జనాలు ఎక్కువగా ఉన్నారని చెబితే, బయటకు వచ్చేశాను. తొక్కిసలాటలో మహిళ చనిపోయిన విషయం మరుసటి రోజు వరకు నాకు తెలియదు. మహిళ చనిపోయిన ఘటన తెలిసి కూడా థియేటర్ నుంచి ఎలా వెళ్లిపోతాననుకున్నారు? నాకూ పిల్లలు ఉన్నారు కదా. మరుసటి రోజు విషయం తెలిసిన తర్వాత బన్నీ వాసుకు ఫోన్ చేసి, ఆస్పత్రికి వెళ్లమని చెప్పాను. నేను కూడా బయలుదేరదామని సిద్ధమయ్యా. కానీ, నాపై కేసు నమోదు చేశారని బన్నీ వాసు చెప్పాడు. నా లీగల్ టీమ్ కూడా వద్దని వారించింది. అందుకే నేను ఆస్పత్రికి వెళ్లలేదు’’
‘‘గతంలో పలువురి హీరోల అభిమానులు చనిపోతే పరామర్శించడానికి వెళ్లాను. నా సొంత అభిమానులు చనిపోతే, వెళ్లి కలవనా? జరిగిన ఘటన విషయం తెలిసి షాక్‌లో ఉన్నా. అందుకే ఆలస్యంగా వీడియో పెట్టా. డబ్బులు అనేది ఇక్కడ విషయమే కాదు. చాలా ఈవెంట్లు పెట్టాలని అనుకున్నాం. ఈ ఘటన తర్వాత అన్నింటినీ రద్దు చేశాం. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి స్పెషల్ అనుమతి తీసుకుని, మా నాన్నను వెళ్లమని చెప్పాను. అదీ కుదరదని అన్నారు. కుదిరితే సుకుమార్‌గారిని వెళ్లమని చెప్పాను. అదీ కాదన్నారు. నేను ఆ కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని అందరూ ఆరోపిస్తున్నారు. అంతేకాదు నా క్యారెక్టర్‌ను చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఇది మాత్రం మనసుకు తీసుకోలేకపోతున్నా. చాలా బాధగా ఉంది. మీరు థియేటర్‌కు వచ్చి ఎంజాయ్ చేయాలని నేను సినిమాలు చేస్తున్నా. ఈ ఘటన విషయంలో బాధిత కుటుంబాన్ని ఆదుకోవడానికి పెద్ద అమౌంట్ ఫిక్స్‌డ్ చేయాలని అనుకున్నాం. అవసరమైతే బాలుడికి ఫిజియో థెరపీ చేయించాలనుకున్నాం. తెలుగువారు గర్వపడేలా సినిమా చేశానని అనుకుంటుంటే, మనల్ని మనం కిందకు లాక్కుంటున్నాం’’
‘‘నేనెవరినీ నిందించడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టలేదు. మా సినిమాకు ప్రభుత్వం అన్ని రకాలుగా సపోర్ట్ చేసింది. అందుకు ధన్యవాదాలు. కానీ, నాపై తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారు. నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారు. 22 ఏళ్లుగా కష్టపడి సాధించిన నమ్మకం, గౌరవం ఒక రాత్రిలో పోగొట్టారు. అందుకు బాధగా ఉంది. అంతేగానీ, నాకు ఎవరిపైనా వ్యక్తిగతంగా కోపాలు లేవు. నాకు మానవత్వం లేదనడం సరికాదు. మళ్లీ మళ్లీ చెబుతున్నా, నా వ్యక్తిత్వంపై చేసిన ఆరోపణలన్నీ 100 శాతం అబద్ధం. ప్రస్తుతం న్యాయపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండటంతో మీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నా. త్వరలోనే అన్నింటికీ సమాధానమిస్తా’’ అని అల్లు అర్జున్ అన్నారు.
మూడు తరాలుగా మా కుటుంబం ఏంటో తెలుసు: అల్లు అరవింద్
అనంతరం అల్లు అర్జున్ తండ్రి అరవింద్ మాట్లాడుతూ.. ‘‘దయచేసి అర్థం చేసుకోండి. న్యాయపరమైన సమస్యలు ఎదురవుతాయనే ఉద్దేశంతోనే మీ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అల్లు అర్జున్ వెళ్లిపోయారు. తాను చేసిన పాన్ ఇండియా మూవీని థియేటర్‌లో చూసుకుందామనే వెళ్లాడు. థియేటర్ వద్ద జరిగిన ఘటన తర్వాత మా ఇంట్లో పార్కులో ఓ మూలన కూర్చొని అదే ఆలోచనలో ఉన్నాడు. పలువురు సక్సెస్ సెలబ్రేషన్స్ చేస్తామని చెబుతున్నా, ఎక్కడికీ వెళ్లడం లేదు. ఒక అభిమాని కుటుంబం ఇలా అయిపోయిందని బాధపడుతున్నాడు. 22 సంవత్సరాలు కష్టపడి ఈ పేరు సంపాదించుకున్నాడు. ఇదంతా ఒక రాత్రి, ఒక సినిమా, ఒక ప్రెస్‌మీట్‌లో రాలేదు. మూడు తరాలుగా మా కుటుంబం గురించి తెలుసు. ఎప్పుడైనా ఇలా వ్యవహరించామా? మీ కళ్ల నుంచి తప్పించుకుని ఇన్నేళ్లు ఉండగలమా? మాపై అసత్య ప్రచారాలు చేస్తుంటే, బాధగా ఉంది. అందుకే మీ ముందుకు వచ్చాం. ప్రజలు ఆదరిస్తే పైకి వచ్చిన కుటుంబం ఇది. ఆ అభిమానాన్ని ఇలాగే కొనసాగించాలని కోరుతున్నాం’’ అని అరవింద్ అన్నారు.