సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం.. అమరావతి ఇన్నోవేషన్ హబ్‌కు రతన్ టాటా పేరు..

www.mannamweb.com


నేషనల్‌ ఐకాన్‌.. భారత కోహినూర్.. వ్యాపార దిగ్గజం రతన్‌టాటా ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే.. రతన్ టాటా.. గొప్ప వ్యాపారవేత్త అయినప్పటికీ.. అంతకుమించిన మహా మనీషి.

వ్యాపారానికి, విలువలు జోడించిన వ్యక్తి.. అందుకే.. దిగ్గజ కార్పొరేట్లకు అంతనంత ఎత్తుకు ఎదిగారు.. మనదేశంలో రతన్ టాటా స్టార్టప్‌ విప్లవానికి ప్రేరణగా మారారు.. అందుకే.. అలాంటి మహోన్నత వ్యక్తికి గుర్తింపుగా.. నివాళులర్పిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.. ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయనున్న ఇన్నోవేషన్ హబ్‌కు రతన్ టాటా పేరు పెడుతున్నట్లు ఏపీ ప్రభుత్వం సోమవారం వెల్లడించింది.. రతన్ టాటా వారసత్వాన్ని గుర్తుచేసుకోవడానికి.. తాము అమరావతిలో ‘రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్’ పేరుతో ఒక ఇన్నోవేషన్ హబ్‌ను స్థాపించాలని నిర్ణయించుకున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.

ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో ట్వీట్ చేశారు. రతన్ టాటాకు నివాళిగా అమరావతిలో ఏర్పాటు చేయనున్న ఇన్నోవేషన్ హబ్‌కు ఆయన పేరు పెడుతున్నట్టు ట్వీట్ చేశారు. స్టార్టప్‌లకు మెంటార్‌గా వ్యవహరించనున్న ఇన్నోవేషన్ హబ్ పెట్టుబడుల ప్రోత్సాహక ఎకో సిస్టమ్‌ను కల్పిస్తుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

రాష్ట్రంలోని ఇతర ఐదు జోనల్ కేంద్రాలకు అనుసంధానంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఉంటుందని వెల్లడించారు. ప్రముఖ వాణిజ్య సంస్థలు, గ్రూప్ ల పర్యవేక్షణలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆయా రంగాల్లో సాంకేతికత, నైపుణ్యాలకు కేంద్రంగా తీర్చిదిద్దుతామని ట్వీట్ లో సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తాము అమరావతిలో ఏర్పాటు చేయబోయే.. ‘రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్’ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎకోసిస్టమ్, మెంటర్ స్టార్టప్‌లను ప్రోత్సహిస్తుందని చంద్రబాబు తెలిపారు.

వాస్తవానికి చంద్రబాబు రతన్ టాటా మధ్య మంచి సంబంధాలు ఉండేవి.. హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధి నాటి నుంచి వీరిద్దరి మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయి.. అందుకే.. ఇటీవల రతన్ టాటా మరణించిన క్రమంలో చంద్రబాబు స్వయంగా ముంబై వెళ్లి నివాళులర్పించారు.