వాషింగ్టన్ : అమెరికాలోని ప్రవాస భారతీయులు లక్ష్యంగా ట్రంప్ యంత్రాంగం మరింత నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నది.
ముఖ్యంగా శాశ్వత పౌరసత్వానికి ఆధారమైన గ్రీన్‌కార్డున్న భారతీయ వృద్ధులను విమానాశ్రయాలలో బెదిరింపులకు గురిచేస్తున్నది. వారి గ్రీన్‌కార్డులను స్వాధీనం చేయాలని, పౌరసత్వం వదులుకుంటున్నట్టు ఐ-407 ఫారంపై సంతకం చేయాలని ఒత్తిళ్లకు గురిచేస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో పెరుగుతున్నట్టు తెలుస్తున్నది.
శీతాకాలంలో పలువురు ప్రవాస భారతీయులు అక్కడి వాతావరణాన్ని తట్టుకోలేక స్వదేశం వస్తుంటారు. మూడు నెలలు ఇక్కడ గడిపి తిరిగి వెళ్తున్న వృద్ధులను విమానాశ్రయాలలో కస్టమ్స్, బార్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) అధికారులు నిర్బంధిస్తున్నారు. అమెరికా ఇమ్మిగ్రేషన్, నేషనాలిటీ చట్టం (ఐఎన్‌ఏ) ప్రకారం ఆ దేశ పౌరులు 180 రోజులు దేశం వీడి తిరిగి వస్తే, వారిని పునఃప్రవేశం కోరుతున్నట్టుగా భావిస్తారు. వారికి ప్రవేశాన్ని నిరాకరించే అవకాశం కూడా ఉంది. అయితే గ్రీన్‌కార్డు ఉన్నవారు ఏడాది కన్నా ఎక్కువ కాలం అమెరికాకు వెలుపల ఉంటేనే ఈ చట్టం వర్తిస్తుందని ఫ్లోరిడాకు చెందిన ప్రవాస భారతీయ న్యాయవాది అశ్విన్ శర్మ చెప్పారు.
అయితే ఏడాదికన్నా తక్కువ కాలం దేశం విడిచి వెళ్లిన ఎన్నారైల గ్రీన్‌కార్డులను రద్దు చేయడం ఇటీవలి కాలంలో పెరిగిపోయిందని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా భారతీయ వృద్ధులను సీబీపీ టార్గెట్ చేస్తున్నదని తెలిపారు. గ్రీన్‌కార్డులను స్వాధీనం చేయని వారిని నిర్బంధిస్తామని లేదా స్వదేశానికి తిరిగి పంపుతామని బెదిరిస్తున్నారని చెప్పారు. సీబీపీ సిబ్బందికి ట్రంప్ ప్రభుత్వం న్యాయమూర్తిగా, న్యాయవ్యవస్థగా, చట్టాన్ని అమలుచేసే సంస్థగా అధికారాలు కల్పించిందని అన్నారు.
గ్రీన్‌కార్డు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని అధికారులకు స్వాధీనం చేయకూడదని సియాటిల్‌కు చెందిన మరో న్యాయవాది కృపా ఉపాధ్యాయ్ సూచించారు. ఎవరైనా స్వచ్ఛందంగా తమ గ్రీన్‌కార్డును స్వాధీనం చేసి, ఐ-407 పత్రంపై సంతకం చేస్తే తప్ప వారి సభ్యత్వం రద్దు కాదని చెప్పారు. అలాగే ఏడాది కన్నా అధికంగా అమెరికా వెలుపల గడిపినవారు తమ నివాసాన్ని వదులుకున్నట్టు భావిస్తారని తెలిపారు. అయితే ఇలాంటివారు తమ నివాస హక్కు కోసం కోర్టును ఆశ్రయించవచ్చన్నారు.