ఆగస్టు వరకు విద్యార్థి ఇంటర్వ్యూలు
జూన్ నుంచి దశల వారీగా స్లాట్ల విడుదల
అమెరికాలో ఉన్నత విద్య చదవాలనుకునే విద్యార్థులకు జూన్, జులై, ఆగస్టు కోటాకు సంబంధించిన మరిన్ని విద్యార్థి వీసా(ఎఫ్-1) ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. అమెరికాలో ఫాల్ ఎడ్యుకేషన్ సీజన్ ఆగస్టు-సెప్టెంబరులో ప్రారంభమవుతుంది. సాధారణంగా సీజన్ చివరి వారంలో ఒక దఫా ఇంటర్వ్యూలో వీసా దరఖాస్తు ఆమోదం పొందనివారికి మరో అవకాశం కల్పిస్తారు. ఈ దఫా ఆగస్టు నెలాఖరు వరకు వీసా స్లాట్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించటం విశేషం. ఆ సీజన్‌లో అమెరికా వెళ్లేందుకు ఇప్పటికే స్లాట్లు తీసుకున్న విద్యార్థులకు సోమవారం నుంచి హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో వీసా ఇంటర్వ్యూలు ప్రారంభించారు. ప్రస్తుత సీజన్‌కు సంబంధించిన తొలి విడత ఇంటర్వ్యూ తేదీల(స్లాట్ల)ను అమెరికా ఈ నెల రెండో వారం ప్రారంభంలోనే విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ దఫా పెద్దసంఖ్యలో భారతీయ విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు వీలుగా దశలవారీగా స్లాట్లు విడుదల చేయనున్నట్లు ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు. విద్యార్థి వీసా సీజన్‌లో ఆగస్టు చివరి వరకు స్లాట్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించినట్లు అమెరికా రాయబార కార్యాలయం మంగళవారం ప్రకటించింది. చివరి నిమిషంలో వెళ్లేవారికీ ఉపయుక్తంగా ఉండాలన్న ఆలోచనతో ఆగస్టు దాకా ఇంటర్వ్యూలు నిర్వహించాలని నిర్ణయించారు. త్వరలో మరిన్ని స్లాట్లు విడుదల చేయనున్నారు. దిల్లీలోని రాయబార కార్యాలయం, హైదరాబాద్, చెన్నై, ముంబయి, కోల్‌కతాలలోని కాన్సుల్ జనరల్ కార్యాలయాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు అధికారిక వెబ్‌సైట్‌లో స్లాట్లు అందుబాటులో ఉన్నట్లు కాన్సులేట్ జనరల్ కార్యాలయం ప్రకటించింది.
విద్యార్థులకు 24న అవగాహన కార్యక్రమం
ప్రస్తుత ఫాల్ సీజన్‌తోపాటు 2025 స్ప్రింగ్ సీజన్‌లో అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థుల కోసం హైబ్రిడ్ విధానంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎడ్యుకేషన్ యూఎస్‌ఏ మంగళవారం ‘ఎక్స్’ వేదికగా ప్రకటించింది. ఈ నెల 24వ తేదీన ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపింది. ఆన్‌లైన్‌లో హాజరు కావాలనుకునేవారు bit.ly/EdUSASVS24 ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. హైదరాబాద్‌లో ప్రత్యక్షంగా హాజరు కావాలనుకునేవారికి ఎస్.ఎల్.జూబ్లీ కాంప్లెక్స్, 4వ అంతస్తు, రోడ్ నంబర్ 36, జూబ్లీహిల్స్‌లో శుక్రవారం మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల మధ్య కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమంలో అమెరికా వీసా కాన్సులర్ అధికారి వీసా దరఖాస్తు ప్రక్రియపై అవగాహన కల్పించనున్నారు.