Amit Shah: మళ్లీ వచ్చేది మోదీ సర్కార్.. పీవోకే విలీనం పక్కా: అమిత్ షా
సార్వత్రిక ఎన్నికల సమయంలో పీవోకే అంశాన్ని లేవనెత్తిన భాజపా.. ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో కేంద్రమంత్రి అమిత్ షా (Amit Shah) ఈ విషయాన్ని మరోసారి ప్రస్తావించారు. కచ్చితంగా పీవోకే మన దేశంలో విలీనం అవుతుందని పేర్కొన్నారు. హరియాణాలోని కర్నల్‌లో సోమవారం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొన్న షా.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
‘‘జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ‘ఆర్టికల్ 370’ను కాంగ్రెస్ తన హయాంలో రద్దు చేయలేకపోయింది. అందుకు కారణం బుజ్జగింపు రాజకీయాలే. అక్కడ ఉగ్రవాద చర్యలు పెరిగిపోయినప్పటికీ అడ్డుకోలేపోయింది. కానీ, మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ ఆర్టికల్‌ను రద్దు చేశారు. ప్రస్తుతం కశ్మీర్‌లో మన త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడుతోంది. మళ్లీ వచ్చేది మోదీ సర్కార్. త్వరలో పీవోకే భారత్‌లో విలీనం అవుతుంది’’ అని అమిత్ షా పేర్కొన్నారు.
మైనారిటీ ఓటు బ్యాంకును పొందేందుకే కాంగ్రెస్ అగ్రనేతలైన మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనలేదని షా ఆరోపించారు. ‘‘ఖర్గే జీ.. మీరు ఎనిమిది పదుల వయసులో ఉన్నా.. దేశ పరిస్థితి గురించి సరిగా అర్థం చేసుకోలేపోయారు. కానీ, హరియాణా యువత కశ్మీర్ కోసం తమ ప్రాణాలు ఇవ్వగలరు’’ అని విమర్శించారు.