ఇల్లు అమ్ముకున్న బిగ్ బి.. వచ్చిన లాభం చూసి గుడ్లు తేలేస్తున్న రియల్టర్లు

బాలీవుడ్ ఐకాన్ అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో సక్సెస్‌ఫుల్ సినిమాలు చేసి ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించారు.
తన వాయిస్, యాక్టింగ్‌తో ఎందరో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. షెహన్షా ఆఫ్ బాలీవుడ్‌గా పేరొందిన అమితాబ్ బచ్చన్.. 4 నేషనల్ అవార్డులతో పాటు ఒక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, మరెన్నో ఫిల్మ్‌ఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నారు. తాజాగా ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు. సినిమాల్లో నటించి బిగ్ బీగా పేరొందిన బచ్చన్.. రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ తనదైన మార్క్‌ చూపిస్తున్నారు. ముంబైలోని తన డూప్లెక్స్‌ను తాజాగా రూ.83 కోట్లకు అమ్మారు. దీనిపై ఆయనకు ఏకంగా 168 శాతం లాభం రావడం విశేషం.


ఇల్లు అమ్ముకున్న బిగ్ బి..
ముంబైలోని ఒషివారలో 1.55 ఎకరాల్లో క్రిస్టల్ గ్రూప్(Crystall Group) సంస్థ ‘ది అట్లాంటిస్’ అనే రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ను నిర్మించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా 4, 5, 6 BHK అపార్ట్‌మెంట్లను నిర్మించారు. వీటిలో అమితాబ్ బచ్చన్‌కి ఒక డూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ ఉంది. 2021, ఏప్రిల్‌లో దీన్ని రూ.31 కోట్లకు కొనుగోలు చేశారు. తర్వాత దీన్ని రెంట్‌కి ఇచ్చారు. నటి కృతి సనన్ ఈ అపార్ట్‌మెంట్‌ను నెలకు రూ.10 లక్షలకు అద్దెకు తీసుకుంది. కృతి సనన్ నుంచి బిగ్ బీ రూ.60 లక్షల డిపాజిట్‌ తీసుకున్నారు. తాజాగా, ఈ డూప్లెక్స్‌ను అమితాబ్ భారీ ధరకు అమ్మేశారు.

* భారీగా పెరిగిన వాల్యూ!
స్క్వేర్ యార్డ్స్(Square Yards) రిపోర్ట్స్ ప్రకారం.. ఒషివారలోని డూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను అమితాబ్ బచ్చన్ రూ.83 కోట్లకు విక్రయించారు. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను బట్టి ఈ సేల్ ట్రాన్సాక్షన్ 2025, జనవరిలో రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది. IGR రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్‌ను స్క్వేర్ యార్డ్స్ రివ్యూ చేయగా, ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసిన నాలుగేళ్ల తర్వాత అమితాబ్ దీన్ని అమ్మారు. ఈ గ్యాప్‌లో ప్రాపర్టీ వాల్యూ భారీగా పెరిగి, ఊహించని లాభం వచ్చింది. కొన్ని ధరతో పోలిస్తే అపార్ట్‌మెంట్‌ను బిగ్‌ బీ ఏకంగా 168 శాతం లాభానికి అమ్మారు. ఈ ట్రాన్సాక్షన్‌కు రూ.30 వేల రిజిస్ట్రేషన్ ఛార్జీలతో పాటు రూ.4.98 కోట్ల స్టాంప్ డ్యూటీ పేమెంట్ జరిగినట్లు తెలుస్తోంది.

* అపార్ట్‌మెంట్ ఏరియా, ఫీచర్లు!
వెస్టర్న్ ముంబైలోని ఈ ప్రీమియం డూప్లెక్స్ అపార్ట్‌మెంట్ ప్రముఖ లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌కు సమీపంలో ఉంది. మోడర్న్ లివింగ్‌కి, అర్బన్ కన్వీనియన్స్‌కి సరిగ్గా సరిపోయే ఈ డూప్లెక్స్‌కు మంచి రోడ్డు సదుపాయంతో పాటు మెట్రో కనెక్టివిటీ ఉంది. 529.94 చదరపు మీటర్లు (దాదాపు 5,704 చదరపు అడుగులు) బిల్టప్ ఏరియా; 481.75 చదరపు మీటర్లు(5,185.62 చదరపు అడుగులు) కార్పెట్ ఏరియా దీని సొంతం. ఇందులో లగ్జరీ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆరు మెకానైజ్డ్ కారు పార్కింగ్ స్థలాలు ఉన్నాయంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 445.93 చదరపు మీటర్ల(4,800 చదరపు అడుగులు) విశాలమైన టెర్రస్ కూడా ఉంది. దీంతో చుట్టూ ఉన్న అందాలను హాయిగా చూడొచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.