వార్షిక మకరవిళక్కు యాత్ర సీజన్ ప్రారంభం నాటి నుంచి శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు.. లక్షలాది మంది భక్తులు అయ్యప్పస్వామిని దర్శించుకుంటున్నారు.
ఈ తరుణంలో శబరిమలలో అరవణ పాయసం ప్రసాదం కొరత తీవ్రంగా ఉన్నట్లు దేవస్వం బోర్డు ప్రకటించింది.. ఈ మేరకు శబరిమలలో అరవణ పాయసం ప్రసాదం డబ్బాల పంపిణీపై దేవస్వం బోర్డు తాత్కాలిక పరిమితి విధించింది. భక్తులకు గరిష్టంగా 20 ప్రసాదం టిన్నులు మాత్రమే ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఒక్క భక్తుడికి 20 టిన్నులు మాత్రమే ఇవ్వనున్నారు. ఒక్క టిన్ను ఖరీదు రూ.100గా ఉంది. ఈ మేరకు అరవణ పాయసం ప్రసాదం పంపిణీ కౌంటర్ల ముందు ఈ పరిమితికి సంబంధించిన బోర్డులను ఉంచారు. ప్రస్తుతానికి అధిక సంఖ్యలో ప్రసాదం డబ్బాలు అందుబాటులో లేవని.. దీంతో పరిమితి విధించినట్లు తెలిపింది.
అయితే.. పెద్ద ఎత్తున అమ్మకాలు జరగడం, పంపిణీకి అవసరమైన పెట్టెల కొరతే ఈ ఆంక్షలు విధించడానికి ప్రధాన కారణమని దేవస్వం బోర్డు అధికారులు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే భక్తులు పెద్ద మొత్తంలో అరవణ ప్రసాదం డబ్బాలను కొనుగోలు చేయడంతో సంక్షోభం మరింత తీవ్రమైంది.
అంతేకాకుండా, అరవణ అమ్మకాలు ఉత్పత్తి కంటే ఎక్కువగా ఉండటం వల్ల సంక్షోభం కూడా ఏర్పడుతుందని పేర్కొంటున్నారు. సాధారణంగా రోజుకు 2.5 నుండి 3 లక్షల టిన్లు ఉత్పత్తి అవుతాయి. అయితే, ప్రస్తుతం రోజుకు 4 లక్షల టిన్లు అమ్ముడవుతున్నాయి.
ప్రస్తుత పరిస్థితి ఏమిటంటే, గతంలో నిల్వ చేసిన దాదాపు లక్ష టిన్ల అరవణను ప్రతిరోజూ బయటకు తీస్తున్నారు. ఇదే రేటుతో అమ్మకాలు కొనసాగితే, కొన్ని రోజుల్లో అరవణ సరఫరా పూర్తిగా నిలిచిపోతుందని దేవస్వం బోర్డు అధికారులు కూడా తమ ఆందోళనలను పంచుకున్నారు.
అరవణ ప్రసాదం కొరతకు.. ప్రధాన కారణం గతేడాది(జనవరి 2024) అరవణ ప్రసాదంలో వినియోగించే యాలకుల్లో పురుగుల మందుల అవశేషాలు ఉన్నట్లు కలకలం రేగడంతో.. ఆ సమయంలో లక్షలాది ప్రసాదం డబ్బాలను అధికారులు ధ్వంసం చేశారు. ఇది కూడా ఓ కారణమని అధికారులు తెలిపారు.



































