రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంపై ఒకవైపు హర్షం వ్యక్తమవుతుండగా, మరోవైపు పురుషులపై ఆర్టీసీ టికెట్ ధరలు ఇష్టానుసారం పెంచడంపై తీవ్ర అసంతృప్తి నెలకొంది.
శనివారం రాఖీ పండుగ సందర్భంగా జరిగిన ఒక సంఘటన దీనికి నిదర్శనం.
తిమ్మాజిపేట నుంచి జడ్చర్లకు వెళ్లడానికి బయలుదేరిన ఒక ప్రయాణికుడు రూ.30 గా ఉన్న టికెట్ ధర రూ.50కి పెరగడం చూసి ఆశ్చర్యపోయాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఛార్జీలు పెరగడంపై అతను కండక్టర్‌ను ప్రశ్నించగా, “రాఖీ పండుగ సందర్భంగా ప్రభుత్వం రేట్లు పెంచిందని” జవాబు ఇచ్చారు. దీంతో ఆ ప్రయాణికుడు షాక్ కు గురయ్యాడు.
మహిళలకు ఉచితం అంటూ, పురుషులపై ఇలా ఛార్జీలు పెంచడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాఖీ పండుగ వేళ అక్కాచెల్లెళ్లకు అన్నదమ్ములు బహుమతులు ఇస్తే, ప్రభుత్వం మాత్రం పురుషులపై భారం మోపి బహుమతిగా ఇచ్చిందని పలువురు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఉచిత పథకాల పేరుతో ఒక వర్గానికి సబ్సిడీ ఇస్తూ, మరో వర్గంపై ఆర్థిక భారం మోపడం సరైన విధానం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఛార్జీల పెంపుపై ఒక స్పష్టమైన వివరణ ఇవ్వాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
































