ఆంధ్రా ప్యారిస్‌.. ప్రణాళికలు అదుర్స్‌

ముచ్చటగా మూడు కాలువలతో ఆంధ్రా ప్యారిస్‌గా చారిత్రక గుర్తింపు పొందింది తెనాలి పట్టణం. ఎటుచూసినా జలసవ్వళ్లు, ఆహ్లాదపరిచే పచ్చదనం..ఈ పట్టణ ప్రత్యేకత. అలాంటి తెనాలిలో మూడు కాలువలు అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటకులను విస్తృతంగా ఆకర్షించాలని చాలా కాలంగా అనుకుంటున్నా..ఆ దిశగా పడిన అడుగులు అంతంతమాత్రమే. కూటమి ప్రభుత్వం కొలువుదీరినంతనే ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. సంక్రాంతి కల్లా బోటు షికారు, రాబోయే రెండేళ్లలో మరికొన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.


చారిత్రక నేపథ్యమిది.. కృష్ణానదిపై ఆనకట్ట నిర్మించిన తరవాత ఆంగ్లేయులు విజయవాడ నుంచి నిజాంపట్నం వరకు ఉన్న కాలువల లోతు పెంచి, కట్టలను బలోపేతం చేశారు. ఈ క్రమంలోనే తెనాలి నుంచి తూర్పు, నిజాంపట్నం(పడవల కాలువ), పడమర కాలువలు బాగుపడగా..తద్వారా తెనాలి, వేమూరు, నిజాంపట్నం, బాపట్ల నియోజకవర్గాల పరిధిలో సుమారు 90 వేల ఎకరాలకు సాగు, తాగునీరు అందుతోంది. తెనాలి రక్షిత మంచినీటి పథకానికీ వీటి నుంచి నీరు తీసుకుంటారు. నిజాంపట్నం కాలువలో పడవల ద్వారా సరకు రవాణా జరిగేది. ఇంతటి కీలకమైన ఇవి ఏళ్లుగా మురుగు కూపాల్లా మారాయి. పట్టణంలో సుమారు 2 కిలోమీటర్ల మేర వెళ్లే ఇవి రెండేళ్ల క్రితం వరకు ఆక్రమణల కోరల్లో చిక్కాయి.

గతంలో చొరవ ఇలా.. ఆక్రమణలు తొలగించాలని, కట్టలు అభివృద్ధి చేయాలని గతంలో పాలకులు సంకల్పించగా..వివిధ సందర్భాల్లో ఆ దిశగా అడుగులు పడ్డాయి. నాదెండ్ల మనోహర్‌ తొలి అడుగు వేసి రెండు కాలువల మధ్య రోడ్ల విస్తరణ చేపట్టారు. అనంతరం ఆలపాటి రాజా దాన్ని కొనసాగించారు. గత ప్రభుత్వ హయాంలో పట్టణ పరిధిలో అర్ధ కిలోమీటరు మేర బండ్, మహనీయుల విగ్రహాలు ఏర్పాటుచేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కొలువుదీరినంతనే నాదెండ్ల మనోహర్‌ మరోసారి దృష్టి పెట్టారు. కాలువల్లో టన్నుల కొద్దీ వ్యర్థాలు తొలగించారు. మురుగునీరు కాలువల్లోకి రాకుండా కట్టడి చేయాలనీ పురపాలకసంఘాన్ని ఆదేశించారు.

భవిష్యత్తు లక్ష్యాలివి.. రానున్న సంక్రాంతి కల్లా బోటు షికారు పట్టాలెక్కించాలనే లక్ష్యంగా కసరత్తు జరుగుతోంది. బండ్‌ల సుందరీకరణ, ప్రజలు బోటు ఎక్కే దిగే ప్రాంతాల గుర్తింపు, స్టాల్స్‌ ఏర్పాటుకు ప్రణాళికలు వేస్తున్నారు. ఆకాశ నడక వంతెన కోసం పదిహేనేళ్ల క్రితమే నాదెండ్ల మనోహర్‌ సంకల్పించినా అడుగులు పడలేదు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు కసరత్తు చేస్తున్నారు. సాధ్యాసాధ్యాలు, అయ్యే ఖర్చు, క్షేత్రస్థాయి ఇబ్బందులను అధికారులు అధ్యయనం చేస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.