అప్పుల ఊబిలో కూరుకుపోయాడు.. వాటిని తీర్చడానికి తాను చనిపోయినట్లు ఓ చిత్రమే తీసేంత స్థాయిలో స్కెచ్ వేశాడు. బీమా సొమ్ము కోసం చనిపోయినట్లు నమ్మించాలని అనుకున్నాడు.
పథకం బెడిసికొట్టి పోలీసులకు అడ్డంగా దొరికాడు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వీరంపాలెంలో ఈ నెల 26న గుర్తుతెలియని వ్యక్తి మృతి కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. కేతమళ్ల వెంకటేశ్వరరావు (పూసయ్య) వీరంపాలెంలో ధాన్యం వ్యాపారి. వివిధ అవసరాలకు తీర్చలేనన్ని అప్పులు చేసాడు. దీంతో ఓ ప్లాన్ రచించాడు.. చనిపోయినట్టు చిత్రీకరించుకుని కొన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళితే తన పేరిట రూ.40లక్షల బీమా సొమ్ము వస్తుందని భావించాడు. ప్రమాదవశాత్తు మరణించినట్టు అందరినీ నమ్మించడానికి ప్రణాళిక రూపొందించాడు. అతడి స్థానంలో వేరే మృతదేహాన్ని ఉంచి ఎవరూ గుర్తించకుండా చేయాలని భావించాడు.
ఆ తర్వాత గుర్తుతెలియని మృతదేహం కోసం రాజమహేంద్రవరం గ్రామీణం మోరంపూడికి చెందిన ఇద్దరు యువకులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. పాత బొమ్మూరులో ఈ నెల 23న ఓఎన్జీసీ ఇంజినీర్ నెల్లి విజయరాజు (53) మరణించారు. కుటుంబీకులు మరుసటిరోజు స్థానిక శ్మశానవాటికలో మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. విషయం తెలుసుకున్న ఇద్దరు యువకులూ పూడ్చిపెట్టిన శవపేటిక నుంచి విజయరాజు మృతదేహాన్ని 25వ తేదీన దొంగిలించారు. వీరయ్య చెప్పిన ప్రకారం.. మర్నాడు దాన్ని వీరంపాలెం తీసుకెళ్లి ఓ పొలంలోని ట్రాన్స్ ఫార్మర్ వద్ద పెట్రోలు పోసి తగలబెట్టారు. పూసయ్య పాదరక్షలు, సెల్ఫోన్ను అక్కడే విడిచి పెట్టి పరారయ్యారు.
అయితే, అక్కడ లభించిన ఆధారాలను బట్టి మృతదేహం పూసయ్యదేనని గ్రామస్థులు భావించి పోస్టుమార్టం కోసం తరలించారు. భర్త మరణించారని భావించి పూసయ్య భార్య తట్టుకోలేక తానూ చనిపోతానంటూ రోదించింది. అయితే, స్థానిక పరిస్థితులను యువకులిద్దరూ పూసయ్యకు ఎప్పటికప్పుడు ఫోన్లో చెప్పేవారు. బాధపడుతున్న భార్యకు విషయం ఎలాగైనా చెప్పాలని భావించి పూసయ్య మరో పథకాన్ని రూపొందించాడు.
గుర్తుతెలియని యువకులు ఎవరో పొలంలో ఓ మృతదేహాన్ని కాలుస్తుండగా తాను అడ్డుకున్నానని, దీంతో వారు తనను కొట్టి ఆటోలో తీసుకెళ్లి దూరంగా తుప్పల్లో పడేసినట్టు పూసయ్య చెప్పుకొచ్చాడు. అయితే, అతడి శరీరంపై గాయాలు లేకపోవడం అనుమానాలకు తావిచ్చింది. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం చెప్పాడు. అతడికి సహకరించిన ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూసయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అనపర్తి సీఐ శివగణేష్, స్థానిక డిఎస్పి వివరాలను వెల్లడించారు.