ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈ కామెడీ జానర్ ను నమ్ముకొని, ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ గా పెట్టుకొని సినిమాలు చేస్తున్న ఈయన, తన దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమాతో కూడా మంచి విజయాన్ని అందుకుంటున్నారు.
ఈ క్రమంలోనే సీనియర్ స్టార్ హీరోలు అనిల్ రావిపూడితో సినిమా చేయడానికి ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతి సందర్భంగా ప్రముఖ బడా నిర్మాత దిల్ రాజు (Dilraju) నిర్మాణ సారధ్యంలో విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రాంతీయ చిత్రంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకొని, ఏకంగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది.
ఫిబ్రవరి 12న సొంత ఊరిలో గృహప్రవేశం..
ఇక ఈ సినిమా తర్వాత కాస్త గ్యాప్ ఇవ్వాలనుకున్నారు అనిల్ రావిపూడి. అందులో భాగంగానే తన సొంత ఊరు అయిన ప్రకాశం జిల్లా చిలుకూరి వారి పాలెంలో తనకంటూ ఒక డ్రీమ్ హౌస్ ను నిర్మించుకున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 12వ తేదీన అత్యంత ఘనంగా ఈ గృహప్రవేశాన్ని నిర్వహించనున్నారు అనిల్ రావిపూడి. ఎన్నాళ్ల నుంచో తన ఆలోచనలకు, అంచనాలకు తగ్గట్టుగా డిజైన్ చేసుకుంటూ రూపొందించిన ఆ ఇంటికి, ఫిబ్రవరి 12న గృహప్రవేశం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు సీనియర్, యంగ్ ,స్టార్ హీరోలు ,హీరోయిన్లు గెస్ట్ గా రాబోతున్నట్లు సమాచారం
సెంటిమెంట్ ప్రకారం చిరంజీవి మూవీ స్క్రిప్ట్ వర్క్ మొదలు..
ఆ హడావిడి ముగిశాక సెంటిమెంట్ ప్రకారం వైజాగ్ వెళ్లి చిరంజీవి (Chiranjeevi) సినిమా స్క్రిప్ట్ వర్క్ మొదలు పెడతారు. మొత్తానికైతే అనిల్ రావిపూడి అటు సొంత ఇంటి కలలు నెరవేర్చుకొని, ఇటు సీనియర్ స్టార్ హీరోలతో వరుస పెట్టి సినిమాలు చేస్తూ మళ్ళీ తన పరంపర కొనసాగించబోతున్నారని చెప్పవచ్చు. ఇక ఈ విషయం తెలిసి మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరోతో అనిల్ రావిపూడి ఎలాంటి సినిమా చేయబోతున్నారు అని ఆతృతగా ఎదురు చూస్తూ ఉండడం గమనార్హం.
అనిల్ రావిపూడి కెరియర్..
అనిల్ రావిపూడి విషయానికి వస్తే.. తొలుత పలు చిత్రాలకు రచయితగా పనిచేసిన ఈయన.. నందమూరి వారసుడు కళ్యాణ్ రామ్ (Kalyan Ram) హీరోగా వచ్చిన ‘పటాస్’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందించడమే కాకుండా కళ్యాణ్ రామ్ కు గట్టి కం బ్యాక్ కూడా ఇచ్చింది. ఈ సినిమా తర్వాత సుప్రీం, రాజా ది గ్రేట్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆ తర్వాత సరిలేరు నీకెవ్వరు, ఎఫ్2, ఎఫ్3 చిత్రాలతో పాటు భగవంత్ కేసరి సినిమాతో కూడా మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక వెంకటేష్ తో ఏకంగా మూడు సినిమాలు చేసి మూడు చిత్రాలతో భారీ విజయాన్ని దక్కించుకున్నారు. సీనియర్ దిగ్గజాలైన నలుగురు స్టార్ హీరోలలో ప్రథమంగా వినిపించే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున , వెంకటేష్ లలో.. బాలకృష్ణ , వెంకటేష్ లతో సినిమాలు చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు అనిల్ రావిపూడి. ఇప్పుడు చిరంజీవితో సినిమా చేయబోతున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ టార్గెట్ నాగార్జున అన్నట్లు సమాచారం . ఏదేమైనా ఈ నలుగురు హీరోలతో అనిల్ రావిపూడి సినిమాలు కంప్లీట్ చేస్తే.. సీనియర్ స్టార్ హీరోలు అందరితో సినిమా చేసిన ఘనత ఈయనకే దక్కుతుందని చెప్పవచ్చు.