కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో అంజిరెడ్డి గెలుపొందారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో BJP అభ్యర్థి విజయం సాధించారు. చివరి వరకు హోరాహోరీగా కౌంటింగ్ కొనసాగింది. కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి రెండో స్థానంలో ఉండగా.. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఒక వైపు కౌంటింగ్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుండగానే కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు.
ఇప్పటికే కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీని కైవసం చేసుకున్న బీజేపీ ఇప్పుడు గ్యాడ్యుయేట్ స్థానాన్ని కూడా తన ఖాతాలో వేసుకుంది. సగం తెలంగాణలో బీజేపీ పట్టు సాధించినట్లయింది. 6 లోక్‌సభ స్థానాలు, 42 అసెంబ్లీ స్థానాలలో బీజేపీ ప్రభావం స్పష్టంగా కనిపించింది. 13 జిల్లాలు, 217 మండలాల్లో బీజేపీ హవా కొనసాగింది. కరీంనగర్ ఎమ్మెల్సీ విజయంలో కిషన్‌రెడ్డి కీలకపాత్ర పోషించారు. రెండు ఎమ్మెల్సీలు గెలుచుకోవడంతో తెలంగాణ బీజేపీలో విజయోత్సాహం కనిపిస్తోంది.