ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ మహిళా నేతగా.. మాజీ మంత్రిగా, సినీనటిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది రోజా సెల్వమణి. తల్లి తగ్గట్టుగానే ఇప్పుడు కూతురు కూడా తన తెలివితేటలను ప్రదర్శిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
రోజా కూతురిగా తెలుగువారికి పరిచయమైన అన్షు మాలిక.. అమెరికాలో మాత్రం ఒకవైపు చదువుకుంటూనే మరొకవైపు తన టాలెంట్ ను ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూ అందరి చేత శభాష్ అనిపించుకుంటోంది. ఇదిలా ఉండగా గత ఏడాది “గ్లోబల్ ఎంటర్ప్రైన్యూర్స్ అవార్డు”ను అందుకున్న ఈమె.. నైజీరియాలోని లాగోస్ లో జరిగిన గ్లోబల్ ఎంటర్ప్రైన్యూర్ షిప్ ఫెస్టివల్ లో సోషల్ ఇంపాక్ట్ విభాగం కింద ఈ అవార్డును దక్కించుకొని అందరిని ఆశ్చర్యపరిచింది.
అయితే ఈ అవార్డు అందుకొని ఏడాది కూడా కాలేదు అప్పుడే మరో అవార్డును అందుకొని తన టాలెంట్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా ఈమెకు లభించిన ఈ అవార్డు గురించి తెలుసుకొని ఇంత చిన్న వయసులోనే ఇంత గొప్ప ఆలోచన.. మరి ఇంత టాలెంటెడా అంటూ అటు వైసీపీ నేతలు, ఇటు సినీ సెలబ్రిటీలు, రోజా అభిమానులు అన్షు మాలిక టాలెంట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
అసలు విషయంలోకి వెళ్తే ప్రస్తుతం అన్షు మాలిక అమెరికా బ్లూమింగ్ టన్ ఇండియానా వర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్స్ చదువుతోంది. ఈ కాలేజీ యాజమాన్యం ఈమెకు “మౌరీన్ బిగ్గర్స్ అవార్డు 2025 -2026” అవార్డును అందించింది. ఇండియానా వర్సిటీ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఉమెన్ అండ్ టెక్నాలజీ వ్యవస్థాపకురాలు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మౌరిన్ బిగ్గర్స్ టెక్నాలజీలో ఈక్విటీని ప్రోత్సహిస్తున్న వారికి ఈ అవార్డును అందిస్తారు. అలా ఈ సంవత్సరం రోజా కూతురు అన్షు మాలిక అవార్డును గెలుచుకోవడం విశేషం.
ఈ అవార్డు ప్రధాన ఉద్దేశం ఏమిటంటే.. ప్రపంచవ్యాప్తంగా వెనుకబడిన వర్గాలకు సంబంధించి, వారి సాంకేతిక అవకాశాలపై అధ్యయనం చేయడం.. నమీబియా, నైజీరియా, భారతదేశం లాంటి దేశాలలో వెనుకబడిన వర్గాలలో సాంకేతిక విద్యను పెంపొందించే కోడింగ్ శిబిరాలకు న్యాయకత్వం వహించడం.. అంతేకాదు మహిళలకు డెవలప్మెంట్లో శిక్షణ ఇవ్వడం , సోషల్ మీడియా ద్వారా పేద వర్గాలకు సాంకేతిక విద్యను అందించడం.. ఇలాంటి పలు అంశాలపై పరిశోధన చేసి పనిచేసిన వారికి అవార్డును అందిస్తారు..అందులో భాగంగానే ఈసారి అన్షు ఈ అవార్డును దక్కించుకోవడం జరిగింది.
ఇదిలా ఉండగా ఈ విషయాన్ని అమెరికా లోకల్ మీడియా ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ అన్షు మాలికపై ప్రశంసల వర్షం కురిపించడంతో ఈ విషయాన్ని అన్షు మాలిక తన ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అన్షు మాలికపై ప్రశంసలు కురిపిస్తూ.. అటు రోజాకు కూడా కూతురు గొప్పతనాన్ని పొగుడుతూ అభినందనలు తెలియజేస్తున్నారు.
































