తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షాలు మరింత జోరందుకున్నాయి.
ముఖ్యంగా మెదక్, కామారెడ్డి, హైదరాబాద్‌తో పాటు అనేక జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించారు. వరదల్లో వాహనాలు కొట్టుకుపోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి. అనేక మంది వరద నీటిలో చిక్కుకోగా, రెస్క్యూ టీమ్‌లు కాపాడాయి.
రామాయంపేటలో సుమారు 300 మంది విద్యార్థులు వరద నీటిలో ఇరుక్కుపోయిన సంఘటన పెద్ద ఆందోళన కలిగించింది. ఈ నేపథ్యంలో, అధికారులు గురువారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. దీంతో విద్యార్థులకు మళ్లీ పండగ వాతావరణం నెలకొంది. గణేష్ చతుర్థి సెలవుల తర్వాత ఇది మరో ఆనందకరమైన వార్తగా మారింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే కలెక్టర్లకు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన రెస్క్యూ టీమ్‌లను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఇంకా రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అందువల్ల వరుసగా సెలవులు ప్రకటించే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు.
కరీంనగర్, నిజామాబాద్‌తో పాటు మరికొన్ని జిల్లాల్లో కూడా వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్నందున అక్కడ కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించే అవకాశముంది.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. మరో ఆరు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, రహదారులు చెరువుల్లా మారిపోయాయి. ఈ క్రమంలో అధికారులు ప్రజలకు అనవసరంగా బయటకు వెళ్లవద్దని, ముఖ్యంగా మ్యాన్ హోల్స్, నాలాల వద్ద జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

































