ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రైతులకు మరో శుభవార్త చెప్పింది. ఏపీలో ఈ ఖరీఫ్ సీజన్లో 50 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటన చేశారు.
రైతాంగానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే, ఒక రోజులోనే డబ్బులు కూడా వారి బ్యాంకు ఖాతాలలో పడతాయని ఆయన స్పష్టం చేశారు.
ధాన్యం కొనుగోళ్ళపై మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటన
గతంలో 35.94 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతులకు 8282 కోట్ల రూపాయలను 24 గంటల్లోనే చెల్లించినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఈసారి అదనంగా 3570 కోట్ల రూపాయలతో మరో 15 లక్షల టన్నులు కొనుగోలు చేస్తామని, మొత్తం ధాన్యం కొనుగోళ్ల కోసమే 11,582 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
గతప్రభుత్వ నిర్వాకం చెప్పిన మంత్రి
కాకినాడ కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలు పైన నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడిన ఆయన గత ప్రభుత్వం ఎన్నికల సమయంలో కేవలం 29 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసిందని, 1674 కోట్ల రూపాయలను బకాయి పెట్టిందని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బకాయిలను తామే చెల్లించామని గుర్తు చేశారు. కానీ తమ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని ఆయన స్పష్టం చేశారు.
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు
ఈసారి వారం రోజుల ముందుగానే కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని పేర్కొన్న మంత్రి నాదెండ్ల మనోహర్, కేంద్రం నిర్ణయించిన ధర ప్రకారమే ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు. కేంద్రం ప్రకటించిన ధర ప్రకారం కామన్ రకానికి క్వింటాలుకు 2369 రూపాయలు, ఏ గ్రేడ్ రకానికి క్వింటాలుకు 2389 రూపాయలు చెల్లిస్తామని ఆయన పేర్కొన్నారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు.
రైతులు ఇలా ధాన్యం అమ్మవచ్చు
మనమిత్ర whatsapp గ్రూప్ ద్వారా రైతులు తమ ధాన్యాన్ని విక్రయించుకునే అవకాశం ఉందని, నచ్చిన మిల్లుకు ధాన్యాన్ని సరఫరా చేయవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగనివ్వమని ఆయన పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లపైన మంత్రి చేసిన ప్రకటనతో ఏపీ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
































