వైసీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ముఖ్య నేతలు వరుసగా పార్టీ వీడుతున్నారు. ఇప్పటికే ఇద్దరు రాజ్యసభ సభ్యులు పార్టీకి గుడ్ బై చెప్పారు. టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారు.
ఇప్పుడు తాజాగా మరో ఎంపీ పార్టీ వీడేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. వైసీపీ ఎంపీల పైన బీజేపీ నేతలు గురి పెట్టారు. తాజా మంత్రాంగంలో భాగంగా మరో ఎంపీ కాషాయం గూటికి చేరేందుకు సిద్దమైనట్లు సమాచారం.
బీజేపీలోకి కృష్ణయ్య
వైసీపీ రాజ్యసభ సభ్యులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆర్ కృష్ణయ్య పార్టీ మారేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన కృష్ణయ్యకు జగన్ తన పార్టీ నుంచి రాజ్యసభకు ఎంపిక చేసారు. ఇప్పుడు తెలంగాణలో బీసీ ఓటింగ్ పైన బీజేపీ ఫోకస్ చేసింది. బీసీ సీఎం నినాదం గత ఎన్నికల్లో బీజేపీకి లాభించింది. ఎనిమిది అసెంబ్లీ ఆ తరువాత ఎనిమిది లోక్ సభ సీట్లను గెలుచుకుంది. ఫలితంగా పార్టీలో బీసీ నాయకత్వాన్ని బలోపేతం చేయాలని డిసైడ్ అయింది.
మంత్రాంగం మొదలు
వైసీపీకి రాజ్యసభలో 11 మంది సభ్యులు ఉండగా ఇద్దరు రాజీనామా చేసారు. ఇప్పుడు కృష్ణయ్య తో బీజేపీ ముఖ్య నేతలు టచ్ లోకి వచ్చినట్లు సమాచారం. వైసీపీకి రాజీనామా చేసి..రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయాలని సూచించనట్లు చెబుతున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం.. అసెంబ్లీలో కూటమికి పూర్తి మెజార్టీ ఉండటంతో తిరిగి బీజేపీ నుంచి ఎంపీగా కృష్ణయ్యకు అవకాశం ఇస్తామని ఆ పార్టీ నేతలు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
జగన్ నెక్స్ట్ స్టెప్
కృష్ణయ్య గతంలో అరెస్సెస్ లో క్రియాశీలకంగా పని చేసారు. ఏబీవీపీ నుంచే బీజేపీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గడచిన రెండేళ్లుగా ఆయన వైసీపీ ఎంపీగా కొనసాగుతున్నారు. అయితే కొద్ది రోజుల క్రితమే కృష్ణయ్య పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరిగింది. దీనిని కృష్ణయ్య ఖండించారు. తాను వైసీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేసారు. తిరిగి ఇప్పుడు బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం పైన కృష్ణయ్య ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.