తెలంగాణలోని విద్యార్థులకు గుడ్‌న్యూస్… త్వరలో మరో కొత్త పథకం.. ఎప్పటి నుంచి అంటే

తెలంగాణలోని విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ తెలిపారు. వచ్చే ఏడాది నుంచి తెలంగాణ రాష్ట్రంలో సీఎం బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాన్ని అమలు చేస్తామని ప్రకటించారు.


చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ‘విద్యలో ముందంజలో తమిళనాడు’ అనే కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. తమిళనాడు ప్రభుత్వం అవలంభిస్తున్న సీఎం బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమం హృదయాన్ని తాకింది అని కొనియాడారు.వచ్చే ఏడాది నుంచి తెలంగాణలోనూ అమలు చేస్తామని చెన్నై వేదికగా ప్రకటించారు. ఇంత మంచి కార్యక్రమానికి తనను ఆహ్వానించినందుకు సంతోషకరమని రేవంత్ రెడ్డి అన్నారు. అన్నాదొరై, కరుణానిధి, కామరాజ్ వంటి గొప్ప యోధుల జన్మస్థలం తమిళనాడు అని కొనియాడారు. కరుణానిధి విజన్‌ను అమలు చేస్తున్న స్టాలిన్, ఉదయనిధిలను అభినందిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇందిరాగాంధీ కామరాజ్ ప్లాన్‌ను తీసుకువచ్చారని.. కామరాజ్ తమిళనాడులో తీసుకువచ్చిన విద్యావిధానాన్ని దేశం అనుసరిస్తున్నదని కొనియాడారు. ‘విద్యలో ముందంజలో తమిళనాడు’ అనే కార్యక్రమం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందని అన్నారు.

తెలంగాణ-తమిళనాడుల మధ్య సారూప్యతలు
ప్రభుత్వ కళాశాలలకు వెళ్లే బాలురు, బాలికలకు నాన్ ముదలవన్ (స్కిల్ డెవలప్‌మెంట్) రూ.10 వేల ఉపకార వేతనం స్కీమ్‌లు ఉండడం అదృష్టం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తమిళనాడులోని పేదలకు అండగా మంచి సీఎం స్టాలిన్ ఉన్నారని కొనియాడారు. ఎన్నో శతాబ్దాల నుంచి తమిళ, తెలుగు రాష్ట్రాలు, ప్రజల మధ్య సాంస్కృతిక, చారిత్రక పరమైన బలమైన సంబంధం ఉందని చెప్పుకొచ్చారు. 1991 సరళీకరణ తర్వాత సరళీకృత ఆర్థిక విధానాలతో తమిళనాడులో మ్యానుఫ్యాక్చరింగ్ రంగం అభివృద్ధి చెందిందని.. తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగాలు అభివృద్ధి చెందాయని స్పష్టం చేశారు. సామాజిక న్యాయం అమలులో తమిళనాడు-తెలంగాణ మధ్య సారూప్యతలున్నాయని… తాము కరుణానిధిని స్ఫూర్తిగా తీసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

మధ్యాహ్నా భోజన పథకం ప్రారంభమైంది తమిళనాడులోనే
భారతీయులంతా తమిళనాడు విద్యా విధానంతో స్ఫూర్తి పొందారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. దేశంలో మొట్టమొదటగా మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించింది ఇక్కడే అని సీఎం గుర్తు చేశారు. ఇక్కడ అమలు చేస్తున్న విద్యా విధానం తమకు ప్రేరణ కలిగించిందని అన్నారు. దక్షిణాదికి చెందిన కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు తమిళనాడు విద్యావిధానం ఆదర్శంగా నిలిచిందని ప్రశంసించారు.

పీపీపీ విధానంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు
ఇకపోతే తెలంగాణలోనూ తమ ప్రభుత్వం, తాను విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రిగా ఉన్నా విద్యా శాఖను తన దగ్గరే ఉంచుకున్నానని.. యువతలో నైపుణ్యత పెంచడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీని ప్రారంభించామని వెల్లడించారు. తెలంగాణ నుంచి ఏటా 1.10 లక్షల మంది ఇంజినీరింగ్ విద్యార్థులు కళాశాలల నుంచి బయటకు వస్తున్నారని అయితే నైపుణ్య లేమితో ఉద్యోగాలు దక్కకడం లేదని చెప్పుకొచ్చారు. పీపీపీ విధానంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని.. దానికి చైర్మన్‌గా ఆనంద్ మహేంద్రను నియమించినట్లు స్పష్టం చేశారు. అలాగే కార్పొరేట్ సంస్థల అధిపతులను డైరెక్టర్లుగా నియమించామని సీఎం రేవంత్ రెడ్డి సభ వేదికగా తెలియజేశారు.

వచ్చే ఒలింపిక్స్‌లో స్వర్ణపతకాలు సాధించాలి
గడచిన 22 నెలలుగా తెలంగాణ విద్య వ్యవస్థలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులను ఈ వేదిక నుంచి తమిళ స్నేహితులతో పంచుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సామాజిక న్యాయం, సమానత్వ సాధనలో విద్య పోషించే కీలక పాత్ర పై తన అభిప్రాయాలను వెల్లడించారు.’యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఆలోచన, రూపకల్పన విషయంలో తెలంగాణ తీసుకున్న కార్యచరణను సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.ఐటీఐలను ఏటీసీలుగా మార్చి… యువతను స్కిల్ ఓరియంటెడ్ గా తీర్చిదిద్దుతున్న విధానాన్ని వివరించినట్లు తెలిపారు. వచ్చే ఒలింపిక్స్ లో స్వర్ణ పతకాలు సాధించి భారత జాతీయ పతాకం ప్రపంచ వేదిక పై ఎగురవేయాల్సిన ఆవశ్యకతను గుర్తు చేసి… తెలంగాణ, తమిళనాడు ఆ దిశగా కలిసి పని చేయాల్సిన అవసరాన్ని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. .

ప్రభుత్వ బడుల్లో నర్సరీ విద్య, విద్యార్థులకు ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యం
మరోవైపు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ బడుల్లో త్వరలో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విద్యను ప్రారంభిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అంతేకాదు విద్యార్థుల పికప్, డ్రాపింగ్‌కు ట్రాన్స్ పోర్టు సదుపాయం కల్పించబోతున్న విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.తెలంగాణ విద్యారంగంలో ఇది ఒక గేమ్ ఛేంజర్ కావడం ఖాయం అన్న విశ్వాసం ఉందని అన్నారు. భవిష్యత్ తరాల నిర్మాణానికి విద్య పై పెట్టె ఖర్చును తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడిగా భావిస్తుందని పేర్కొన్నారు. తమిళ, తెలుగు రాష్ట్రాల మధ్య శతాబ్దాలుగా సాంస్కృతిక, చారిత్రకమైన బలమైన సంబంధాలు ఉన్నాయి. ఇక ముందు కూడా ఈ బంధం కొనసాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తమకు సామాజిక న్యాయం విషయంలో స్వర్గీయ కరుణానిధి మార్గం ఆదర్శం. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు తన అభినందనలు తెలియజేశారు సీఎం రేవంత్ రెడ్డి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.