భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఈ కొత్త సంవత్సరం 2026 ప్రారంభంలోనే రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. బ్రాండ్ న్యూ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ లాంచ్ చేయడంతో పాటు ల్యాప్స్ అయిన పాలసీలను పునరుద్ధరించుకునేందుకు ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తోంది.
తమ వినియోగదారులు సింగిల్ ప్రీమియం చెల్లించడంతోనే మంచి బెనిఫిట్స్ పొందేలా కొత్త పాలసీ తీసుకొచ్చింది. అలాగే ప్రీమియం చెల్లించలేక ఆగిపోయిన పాలసీలను పునరుద్ధరించుకునేందుకు మరో అవకాశం కల్పిస్తోంది. మరి ఈ రెండు నిర్ణయాల గురించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఎల్ఐసీ కొత్త పాలసీ
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) తాజాగా కొత్త ప్లాన్ లాంచ్ చేసింది. ఎల్ఐసీ జీవన్ ఉత్సవ్ సింగిల్ ప్రీమియం స్కీమ్ (LIC Jeevan Utsav Single Premium) లాంచ్ చేసింది. ఈ కొత్త పాలసీ వినియోగదారులకు జనవరి 12, 2026 నుంచి అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ జీవన్ ఉత్సవ్ సింగిల్ ప్రీమియం ప్లాన్ అనేది నాన్ పార్టిసిపేటివ్, నాన్ లింక్డ్, ఇండివిడ్యువల్, సేవింగ్స్, పూర్తి జీవితానికి బీమా కల్పించే ప్లాన్. ఈ మేరకు స్టాక్ ఎక్స్చేంజీ ఫైలింగ్‌లో ఎల్ఐసీ తెలిపింది. అయితే, కొత్త ప్లాన్ గురించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు.
గత ఏడాది ఎల్ఐసీ ప్రొటక్షన్ ప్లస్ (ప్లాన్ 886), ఎల్ఐసీ బీమా కవచ్ (ప్లాన్ 887), ఎల్ఐసీ జన్ సురక్షన్ (ప్లాన్ 880), ఎల్ఐసీ బీమా లక్ష్మీ (ప్లాన్ 881), ఎల్ఐసీ స్మార్ట్ పెన్షన్ ప్లాన్ (ప్లాన్ 879) లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సింగిల్ ప్రీమియం ప్లాన్ తెచ్చింది. ఒక్కసారి ప్రీమియం చెల్లిస్తే జీవితాంతం బెనిఫిట్స్ అందుకునేలా ఈ ప్లాన్ రూపొందించినట్లు తెలుస్తోంది.ఆగిపోయిన పాలసీల పునరుద్ధరణ
తమ వినియోగదారులకు మరో అవకాశం కల్పిస్తూ ప్రీమియం చెల్లించలేక ఆగిపోయిన పాలసీను పునరుద్ధరించుకునేందుకు ఛాన్స్ ఇస్తోంది ఎల్ఐసీ. వ్యక్తిగత పాలసీలు ల్యాప్స్ అయిన వారి కోసం ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు ఎల్ఐసీ తెలిపింది. అర్హులైన పాలసీదారులు నాన్ లింక్డ్, మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్స్‌ను పునరుద్ధరించేందుకు ఈ ప్రత్యేక క్యాంపెయిన్‌ను ఉపయోగించుకోవాలని సూచించింది. ఈ ప్రత్యేక కార్యక్రమం జనవరి 1, 2026 రోజునే ప్రారంభమైంది. మార్చి 2,2026 వరకు కొనసాగనుంది. అలాగే నాన్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీలకు లేట్ ఫీజులో డిస్కౌంట్ సైతం ఇస్తోంది. గరిష్ఠంగా రూ.5000 వరకు పాలసీ ప్రీమియం ప్రకారం 30 శాతం మేర తగ్గింపు ఇస్తున్నట్లు తెలిపింది.



































