ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తుఫాన్ ముప్పు పొంచి ఉన్నట్లు అమరావతి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఈ నెల 22వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్సులు ఉన్నట్లు ఈ సందర్భంగా వెల్లడించింది. ఆ తర్వాత 48 గంటల్లో అది మరింత బలపడుతుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్నట్లు వివరణ ఇచ్చింది వాతావరణ శాఖ. దీని ఎఫెక్ట్ తో ఏపీలో నేటి నుంచి 3 రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా రేపు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది.
ఇక ఎల్లుండి బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కృష్ణ జిల్లాల్లో కూడా మళ్లీ వర్షాలు పడతాయని వెల్లడించింది. మంగళవారం అంటే ఇవాళ కూడా ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు పడతాయని స్పష్టం చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. ఈ తరుణంలో ప్రజలు అలర్ట్ గా ఉండాలని పేర్కొంది. ఇది ఇలా ఉండగా ఇటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చలి తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి చుక్కలు చూపిస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 4.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఇటు శ్రీకాకుళం, ఎన్టీఆర్, విజయనగరం, అనకాపల్లి, మన్యం జిల్లాలో కూడా 10 నుంచి 15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో 5 డిగ్రీల వరకే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.




































