రేవంత్ సర్కార్ మరో సూపర్ స్కీమ్.. తెలంగాణ అమ్మాయిలకు ఇది నిజంగా శుభవార్త.

ఆరోగ్య తెలంగాణ నిర్మాణ లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. తాజాగా ‘ఆడపిల్లలకు శక్తినిద్దాం..


ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం’ అనే నినాదంతో మరో సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. రక్తహీనత సమస్యతో బాధపడుతున్న కౌమార బాలికలకు పోషకాహారాన్ని అందజేసేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ చర్యలు మొదలు పెట్టింది. ఇందిరమ్మ అమృతం పేరుతో కౌమార బాలికలకు పోషకాహారం అందించేందుకు పల్లి, చిరుధాన్యాలతో తయారు చేసిన చిక్కీలను ప్రతి నెల అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఉచింతగా పంపిణీ చేయనున్నారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం, కొమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను ఎంపిక చేశారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 ప్రకారం, రాష్ట్రంలో 64.7 శాతం కౌమార బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నట్లు గుర్తించారు. సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర సర్కార్ ఈ పథకాన్ని రూపొందించింది. ‘ఇందిరమ్మ అమృతం’ పేరుతో 14 ఏళ్ల నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సున్న కౌమార బాలికలకు పోషకాహారంగా పల్లి, చిరుధాన్యాలతో తయారైన చిక్కీలను అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఉచితంగా పంపిణీ చేయనున్నారు.

నెలకు రెండు సార్లు పంణీ

రోజూ ఒకటి చొప్పున ఒక్కో బాలికకు నెలకు 30 చిక్కీలు అందజేస్తారు. ఒక్కో చిక్కీలో సుమారు 600 కేలరీలు, 18-20 గ్రాముల ప్రోటీన్లు, వీటితో పాటు అవసరమైన మైక్రో న్యూట్రియెంట్లు ఉంటాయి. పదిహేను చిక్కీల చొప్పున, నెలకు రెండు సార్లు అంగన్వాడీ కేంద్రాల్లో కౌమార బాలికలకు ‘ఇందిరమ్మ అమృతం’ కిట్లను అందజేయన్నారు. బాలికల ఆరోగ్య స్థితిని అంచనా వేసేందుకు ఆరోగ్యశాఖ హెచ్‌బీ పరీక్షలు నిర్వహించనుంది. ఈ సమస్య ఉన్న బాలికలను గుర్తించి వారికి ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలను అందిస్తారు. దీంతో పాటు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ- సెర్ప్ సహకారంతో బాలికల జీవన నైపుణ్యాలను అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేపడతారు. రక్తహీనత తగ్గింపుతో పాటు అంగన్వాడీ కేంద్రాల్లో కౌమార బాలికలకు పోషకాహార చైతన్యం, బాల్య వివాహాలపై అవగాహన, ఆరోగ్యం, పరిశుభ్రతపై మహిళా శిశు సంక్షేమ శాఖ అవగాహన కల్పించనుంది. అంతే కాకుండా వారికి నైపుణ్యాభివృద్ధికి శిక్షణ తరగతులు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కౌమార బాలికలకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడనున్నాయి.

పైలట్ ప్రాజెక్టు కింద మూడు జిల్లాలు ఎంపిక

ఇందిరమ్మ అమృతం పథకాన్ని పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలో మూడు జిల్లాలను ఎంపిక చేశారు. మొదటిసారిగా ఈ పథకాన్ని అమలు చేసేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పథకం ద్వారా మొదటి పారిగా భద్రాద్రి కొత్తగూడెం, కొమురంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలలో మొత్తం 50,269 మంది కౌమార బాలికలు లబ్ధిపొందనున్నారు. జిల్లాల వారిగా భద్రాద్రి కొత్తగూడెం – 23,399 మంది బాలికలు, కుమ్రం భీం ఆసిఫాబాద్ – 18,230 మంది బాలికలు, జయశంకర్ భూపాలపల్లి – 8,640 మంది బాలికలు ఉన్నారు.

రేపే ప్రారంభం

ఇందిరమ్మ అమృతం పథకాన్ని గురువారం భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క చేతుల మీదుగా గురువారం ప్రారంభించనున్నారు. ఈ పథకం అమలు చేయనున్న భద్రాద్రి కొత్తగూడెం, కొమురంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో మహిళా శిశు సంక్షేమ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

బాలికలలో స్వీయ భద్రత పట్ల అవగాహన పెరిగేలా చర్యలు: సీతక్క

ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందజేస్తున్నట్లు మంత్రి చెప్పారు. అయితే మారుతున్న ఆహార అలవాట్లు, జీవన శైలిలో వస్తున్న మార్పులు, మరియు ఇతర ఆరోగ్యకారణాల వలన అనేక మంది మహిళలు రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ సమస్యను ప్రాథమిక దశలోనే గుర్తించి, తగిన సమయంలో చర్యలు తీసుకోవడం అత్యవసరమని, అందుకే కౌమార దశ నుంచే రక్తహీనతను తగ్గించేందుకు ‘ఇందిరమ్మ అమృతం’ పథకాన్ని ప్రారంభిస్తున్నామని అన్నారు. ఈ పథకం ద్వారా కౌమార బాలికలకు పోషకాహారం మాత్రమే కాకుండా, ఆరోగ్య సంరక్షణ, స్వీయ భద్రత పట్ల అవగాహన పెరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ పథకాన్ని మొదటి దశలో రక్తహీనత శాతం అత్యధికంగా నమోదైన మూడు జిల్లాల్లో అమలు చేస్తున్నట్లు వివరించారు. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా పొందిన అనుభవాల ఆధారంగా, పథకాన్ని ఇతర జిల్లాలకు కూడా విస్తరిస్తాం. గ్రామీణ ప్రాంతాల్లోని బాలికల ఆరోగ్య పరిరక్షణలో ‘ఇందిరమ్మ అమృతం’ కీలకంగా నిలవనుంది. అందుకే ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో భాగం కావాలని కౌమార బాలికలకు విజ్ఞప్తి చేస్తున్నామని మంత్రి అన్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.