మహాభారతంలో పద్మవ్యూహం గురించి తరచూ వింటుంటాం. ఇందులోకి ఒక్కసారి వెళ్లడమే తప్ప బయటకు తిరిగి రాలేం. గుండ్రటి వలయంలా ఉంటుందీ పద్మవ్యూహం. అలాంటిదే చీమల్లోనూ అప్పుడప్పుడూ కనిపిస్తుంటుంది.
చీమలన్నీ కలిసి ఒక సర్కిల్‌లా ఏర్పడి ఒకదాని వెంబడి మరొకటి తిరుగుతూ ఉంటాయి. అయితే, అవి అలా ఎందుకు తిరుగుతాయనేది గత కొన్నేళ్లుగా అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. దీంతో కీటకాల నిపుణులు ఈ గుట్టును విప్పేందుకు ప్రయత్నించారు. ఇందులో ఆశ్చర్యపోయే విషయాలు వెల్లడయ్యాయి. చీమలు గుంపులు గుంపులుగా ఒకదాని వెంట మరొకటి అనుసరిస్తూ ఒక చట్రంలో తిరగడాన్ని ‘యాంట్ మిల్'(Ant Mill) అని పిలుస్తారట. ‘యాంట్ స్పైరల్ ఆఫ్ డెత్'(Ant Spiral of Death)గా ఈ ప్రక్రియ ప్రసిద్ధి చెందింది. అయితే, సాధారణ చీమల్లో ఈ ‘మాయా వలయం’ ఎక్కువగా కనిపించదని కీటకాల నిపుణులు చెబుతున్నారు. గండు చీమలు(Army Ants) ఈ ప్రక్రియను ప్రధానంగా పాటిస్తాయట. అయితే, కాలక్రమంలో లూప్‌లో తిరిగి తిరిగి ఇందులోని చాలా చీమలు మరణిస్తాయని నిపుణులు వెల్లడిస్తున్నారు.
* కారణం ఇదే
గండు చీమలు గుడ్డివి. వీటికి కళ్లు కనిపించవు. కాబట్టి ఇవి ఒంటరిగా బతకలేవు. కానీ జట్టుగా కలిస్తే మాత్రం అద్భుతాలు చేయగలవు. అందుకే ఆహారం కోసం గుంపులుగా వెతుకుతూ కలిసి వెళ్తాయి. ఒక చీమను మరొక చీమ అనుసరించేలా ఒక రసాయనాన్ని విడుదల చేస్తాయి. ఇలా ఇతర చీమలు దారి తప్పకుండా ఒకే వరుసలో వెళ్లడానికి తోడ్పడతాయి. రెండు చీమల మధ్య చాలా తక్కువ దూరం ఉండేలా చూసుకుంటాయి. ఈ విధంగా గండు చీమలు ‘యాంట్ మిల్’ పద్ధతిని సృష్టించుకున్నాయి. క్రమంగా ఇదొక పెద్ద గుండ్రటి వలయంలా ఏర్పడుతుంది. ఆహారాన్ని వెతుక్కున్న అనంతరం తిరిగి గూళ్లకు చేరుకుంటాయి. వేలకు వేలు చీమలు పోగవ్వడంతో దారి తప్పే ప్రసక్తి చాలా తక్కువ.
* దారిలోనే మరణం
సాధారణంగా అడవులు, దట్టమైన ప్రాంతాల్లో ఈ ‘స్పైరల్ ఆఫ్ డెత్’ ఏర్పడుతుంది. ఆహారం అన్వేషణ కోసం ఇలా చేసినప్పటికీ ఇదొక మాయా వలయంగా మారుతుంది. ఇందులో పడిన చీమలు అలసిపోయి చనిపోతాయి కూడా. చాలా చీమలు సత్తువ కోల్పోతాయి. డీహైడ్రేషన్ బారిన పడతాయి. ఆకలితో అలమటించి ఎన్నో చీమలు చనిపోతాయి. ఈ లూప్‌లో చీమలు కొన్ని లక్షల సంఖ్యలో ఉంటాయి. కాబట్టి వీటిలో కొన్ని వేల చీమలు చనిపోతే పెద్దగా ప్రభావం ఉండదు. అందుకే మరణాలను లెక్క చేయకుండా మిగతా చీమలు ఈ వలయంలోనే కొనసాగుతుంటాయి.
* బయటకు రాలేవు
ఒక్కసారి ఈ లూప్‌లోకి వెళ్లిన తర్వాత స్వతహాగా చీమలు బయటకు రాలేవు. బాహ్య పరిణామాలతో తప్పితే ఈ స్పైరల్ నుంచి అవి తప్పించుకోలేవు. వర్షం పడటం, బలంగా గాలులు వీయడంతో ఈ వలయం చెల్లాచెదురు అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో మాత్రమే అవి తప్పించుకోగలవు. సొంతంగా చీమలు బయట పడటమనేది అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు.