Antim Naqvi | జింబాబ్వే తరఫున తొలి ట్రిపుల్ సెంచరీ.. చరిత్రను తిరగరాసిన యువకెరటం

Antim Naqvi : జింబాబ్వే యవ క్రికెటర్ అంతిమ్ నక్వీ(Antim Naqvi) చరిత్ర సృష్టించాడు. ఆండీ ఫ్లవర్(Andy Flower), గ్రాంట్ ఫ్లవర్(Garnt Flower) వంటి దిగ్గజాలకు సైతం సాధ్యం కాని రికార్డు నెలకొల్పాడు.
జింబాబ్వే తరఫున తొలి ట్రిపుల్ సెంచరీ నమోదు చేశాడు. మిడ్ వెస్ట్ రైనోస్(Mid West Rhinos) కెప్టెన్ అయిన అంతిమ్ రెండో సీజన్‌లోనే తడాఖా చూపించాడు. జింబాబ్వే తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ కొట్టాడు.


లోగన్ కప్(Logan Cup) మ్యాచ్‌లో భాగంగా మెటాబెలెలలాండ్ టస్కర్స్(Matabeleland Tuskers) జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అంతిమ్ దంచికొట్టాడు. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచి ఊచకోతకు దిగిన 24 ఏండ్ల అంతిమ్.. 295 బంతుల్లోనే 30 ఫోర్లు, 10 సిక్సర్లతో ట్రిపుల్ సెంచరీకి చేరువై రికార్డులు బద్ధలు కొట్టాడు. అయితే.. గతంలో గ్రేమ్ హిక్‌(Greame Hick), ముర్రే గుడ్‌విన్‌(Murray Goodwin)లు కూడా ఫస్ట్ క్లాస్‌లో మూడొందలు కొట్టారు. కానీ, వాళ్లు జింబాబ్వేకు కాకుండా ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించారు.

అంతిమ్ 265 పరుగుల స్కోర్ వద్ద లోగన్ కప్ ఫస్ట్ క్లాస్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇక 280 రన్స్ దాటిన అంతిమ్ 1967-68 మధ్య రే గ్రిప్పర్ 279 రన్స్‌తో నెలకొల్పిన రికార్డును అధిగమించాడు. జింబాబ్వే గడ్డపై ఇప్పటివరకూ అత్యధిక వ్యక్తిగత స్కోర్ 306. అది కూడా న్యూజిలాండ్ ఆటగాడు మార్క్ రిచర్డ్‌సన్(Mark Richardson) పేరిట ఉంది. రిచర్డ్‌సన్ 2000-01లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఈ రికార్డు సాధించాడు. అయితే.. రైనోస్ జట్టు ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంతో అంతిమ్ ఈ రికార్డును బద్ధలు కొట్టలేకపోయాడు.