22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ఆ అంశాలపై వాడీవేడిగా చర్చ జరిగే అవకాశం..!
Ap Assembly Sessions : ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ విషయంపై ప్రభుత్వ యంత్రాంగానికి ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ వివరాలు పంపించారు. ఈ నెల 22న ఉదయం 10 గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశం అవుతుందని లేఖ ద్వారా సమాచారం ఇచ్చారు. ఈ సెషన్స్ మొత్తం 5 రోజుల పాటు జరిగే అవకాశం ఉంది.
ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు ఆమోదం తెలపనుంది. ఏడు శ్వేతపత్రాలు విడుదల చేస్తామని తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నాలుగు శ్వేతపత్రాలను రిలీజ్ చేసింది. మిగిలినవి ఆర్థిక, ఎక్సైజ్, శాంతిభద్రతలకు సంబంధించిన శ్వేతపత్రాలను అసెంబ్లీలోనే విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సీఎం చంద్రబాబు ఈ శ్వేతపత్రాలకు సంబంధించిన వివరాలను అసెంబ్లీ వేదికగా ఇవ్వనున్నారు. ఈ విషయాలను ప్రతిపక్షం ముందే చర్చించాలని చంద్రబాబు భావించారు. ఈ నేపథ్యంలో మిగిలిన శ్వేతపత్రాలను అసెంబ్లీలో రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది.
ఓటాన్ అకౌంట్, శ్వేతపత్రాలతో పాటు వరదలు, రైతులకు సంబంధించిన అంశాలు, నీటిపారుదల తదితర ముఖ్యమైన వాటి గురించి అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి జగన్ తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. శాంతిభద్రతల అంశంపై అసెంబ్లీలో వాడీవేడిగా డిస్కషన్ జరిగే ఛాన్స్ ఉంది. వైసీపీకి ఎమ్మెల్యేలు తక్కువగా ఉన్నందున.. వారికి ఎంత సమయం కేటాయించాలి అనేదానిపై చర్చ జరిగే అవకాశం ఉంది. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని జగన్ కోరినా.. ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా, నిబంధనల ప్రకారం జగన్ కు ఆ అర్హత లేదని ప్రభుత్వం తేల్చి చెబుతోంది. దీనిపైనా అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగే అవకాశం ఉంది.