AP : కొత్త రేషన్‌ కార్డులపై బిగ్‌ అప్‌డేట్‌

రాష్ట్రంలో చాలా మంది కొత్త రేషన్‌ కార్డుల కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. అయితే త్వరలోనే వారికి ఆ బాధలు తప్పనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌ కార్డుల విషయమై కీలక నిర్ణయం తీసుకుంది.


వచ్చే నెల నుంచి క్యూఆర్‌ కోడ్‌తో కూడిన కొత్త రేషన్‌ కార్డులు అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్‌ వెల్లడించారు. నెల్లూరు జిల్లా సంగంలో మాట్లాడుతూ.. పాత కార్డుల్లో మార్పులు, చేర్పులకూ అవకాశం కల్పిస్తామని చెప్పారు. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు.

ఇక రైతులకు పెండింగ్‌లో ఉన్న రవాణా, హమాలీ ఛార్జీలను రెండు రోజుల్లో విడుదల చేస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే.. గత జులై, ఆగస్టులో రేషన్ కార్డులు మంజూరు చేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. అయితే అప్పటి నుంచి పలు కారణాలతో ఈ అంశంలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. వైసీపీ హయాంలోనే కొత్త రేషన్‌ కార్డులు, మార్పులు చేర్పులకు సంబంధించిన రూ.3.36 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు ఛాన్స్‌ కల్పిస్తే కొత్తగా కొన్ని లక్షల దరఖాస్తులు వస్తాయని అంచనా.