ప్రేమ గుడ్డిది అంటారు.. అది నిజమే మరి! వేల మైళ్ల దూరం, భాషా భేదం, సంస్కృతుల తేడా.. ఇలాంటి అడ్డంకులన్నింటినీ ప్రేమ ఒక్క క్షణంలో చెరిపేస్తుంది. తాజాగా అలాంటి ఒక అద్భుతమైన ప్రేమ కథ వెలుగులోకి వచ్చింది. అమెరికాకు చెందిన ఒక ఫొటోగ్రాఫర్, ఆంధ్రప్రదేశ్‌లోని ఒక మారుమూల గ్రామానికి చెందిన యువకుడిని ప్రేమించి ఏకంగా పెళ్లి చేసుకోవడానికి వేల మైళ్లు ప్రయాణం చేసి వచ్చింది.
జాక్లిన్ ఫోరెరో అనే అమెరికన్ ఫొటోగ్రాఫర్‌కు చందన్ అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యాడు. చందన్ నిరాడంబరత్వం జాక్లిన్‌ను ఎంతగానో ఆకర్షించాయి. వారి ప్రేమ కథ ఒక సాధారణ ‘హాయ్’తో మొదలైంది. ఆ తర్వాత అది మనసు విప్పి మాట్లాడుకునే స్థాయికి చేరుకుంది. అలా దాదాపు 14 నెలల పాటు ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే వారి మధ్య ప్రేమ చిగురించింది. ఇప్పుడు ఈ జంట త్వరలోనే పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు.
జాక్లిన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేస్తూ.. “14 నెలల ప్రయాణం.. ఒక కొత్త పెద్ద అధ్యాయానికి సిద్ధం” అని రాసుకొచ్చింది. 45 సెకన్ల నిడివిగల ఒక వీడియోను షేర్ చేస్తూ, ఒక సాధారణ మెసేజ్ ఎలా విడదీయలేని బంధంగా మారిందో వివరించింది. “నేనే చందన్‌కు మొదట మెసేజ్ చేశాను. అతని ప్రొఫైల్‌లో అతను దేవుడిపై ప్రేమ కలిగిన క్రైస్తవుడని, వేదాంత శాస్త్రం తెలిసినవాడని చూశాను” అని ఆమె తెలిపింది. చందన్‌కు ఉన్న సంగీతం, కళ, ఫొటోగ్రఫీ వంటి అభిరుచులు జాక్లిన్‌ను మరింతగా ఆకర్షించాయి.
వారిద్దరి అభిరుచులు ఒకేలా ఉండటం వారిని మరింత దగ్గర చేసింది. “8 నెలలు ఆన్‌లైన్‌లో డేటింగ్ చేసిన తర్వాత, మా అమ్మ కూడా ఒప్పుకోవడంతో, మేమిద్దరం కలిసి జీవితంలో ఒక మరపురాని ప్రయాణం కోసం ఇండియాకు వచ్చాము” అని జాక్లిన్ తెలిపింది.”కొందరు మమ్మల్ని విమర్శించారు. కొందరు మద్దతు తెలిపారు. కొందరు దురుసుగా మాట్లాడారు. మరికొందరు చాలా సానుకూలంగా స్పందించారు. వయసులో ఉన్న తేడా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు” అని ఆమె రాసింది. జాక్లిన్ చందన్ కంటే తొమ్మిది సంవత్సరాలు పెద్దది.
వీడియో చివర్లో ఆమె మాట్లాడుతూ.. “మాకు చాలా అడ్డంకులు ఎదురయ్యాయి. కానీ దేవుడు ప్రతి అడుగులోనూ అద్భుతంగా తలుపులు తెరిచాడు. మాకు సహాయం చేశాడు. యేసు మమ్మల్ని కలిపాడు. ఆయనే మమ్మల్ని ముందుకు నడిపిస్తాడు” అని పేర్కొంది. వారి ప్రేమ కథకు ఆన్‌లైన్‌లో చాలా మంది సపోర్ట్ లభించింది. జాక్లిన్ , చందన్‌కు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. వారి బయోలో “ప్రేమ కోసం పోరాడుతున్న విడాకులు తీసుకున్న క్రైస్తవ తల్లి, ఆంధ్రప్రదేశ్‌లోని ఒక మారుమూల గ్రామంలో నివసిస్తున్న ఒక చిన్న వయస్సు గల వ్యక్తిని ఇన్‌స్టాగ్రామ్‌లో కలిసింది” అని ఉంది. ప్రస్తుతం ఈ జంట తమ జీవితాన్ని యూఎస్‌లో ప్రారంభించడానికి చందన్ వీసా కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. త్వరలో తమ కొత్త జీవితంలో పెద్ద సాహసాలు ఎదురుచూస్తున్నాయని వారు సంతోషంగా ఉన్నారు.