AP Cabinet Meeting: నేడు 11 గంటలకు ఏపీ మంత్రివర్గ భేటీ .. తీసుకోబోయే నిర్ణయాలు ఇవేనా..?

www.mannamweb.com


ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం (జనవరి 31) ఉదయం 11 గంటలకు రాష్ట్ర సచివాలయంమొదటి బ్లాక్‌లో మంత్రి వర్గ సమావేశం జరగనుంది.
ఇందులో 2024-25వ ఆర్థిక సంవత్సరానికిగాను ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

అలాగే, పలు ఇతర కీలక అంశాలపై మంత్రి వర్గ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశంలో ఆమోదించిన పలు పెట్టుబడుల ప్రాజెక్ట్‌లను కూడా మంత్రి వర్గ సమావేశంలో ఆమోదించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారని చర్చ జరుగుతోంది. రైతులకు రుణమాఫీపై నిర్ణయం తీసుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. రుణమాఫీ విధివిధానాలపై మంత్రివర్గంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న ఉద్యోగులకు కూడా తీపి కబురు వినిపించేలా ఉంది.

కొత్త పీఆర్సీ వచ్చేలోపు ఐఆర్ ఇచ్చే యోచనపై చర్చిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల మేనిఫెస్టో, డీఎస్సీ నోటిఫికేషన్, అసెంబ్లీ సమావేశాలు, జగనన్న కాలనీలపై చర్చ జరిగే ఆస్కారం ఉందని తాడేపల్లి నుంచి వస్తున్న వార్త.

ఇక తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయానికి కారణంగా నిలిచిన మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కూడా సీఎం జగన్‌ మదిలో ఉన్నట్టు చర్చ నడుస్తోంది. దీనిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం లేకపోలేదు. జిల్లా పర్యటనలు, ఎన్నికల కార్యచరణ ప్రణాళికపై సహచర మంత్రులతో సీఎం చర్చిస్తారని వినిపిస్తున్న మాట.

ఇక బడ్జెట్‌ ప్రవేశపెట్టే సమయం కూడా కావడంతో వచ్చే నెల రెండోవారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడా ఈ సమావేశంలో చర్చ జరగనుంది. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తుండడంతో సీఎం జగన్‌ భారీ నిర్ణయాలే తీసుకునే అవకాశం ఉంది.