ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారిగా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కాబోతున్నారు ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ ప్రాధాన్యాలతో పాటు లక్ష్యాలను వివరించి వారికి దిశానిర్దేశం చేయనున్నారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలు నిర్వీర్యంగా మారాయని భావిస్తున్న సీఎం చంద్రబాబు.. వేగాన్ని పెంచాల్సిన అవసరం ఉందని పదేపదే చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలో తమ ఉద్దేశాన్ని వివరిస్తూ అధికారులు పనిచేయాల్సిన విధానాన్ని స్పష్టం చేయనుంది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత అంశాలుగా తీసుకున్న విద్య, వైద్యం, సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలలో అధికారుల పాత్ర పెరగాలని, అధికారులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని సీఎం వారిని ఆదేశించనున్నారు. పౌర సేవలు, ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాలపై ప్రభుత్వ వైఖరిని వెల్లడించనున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపైనా ఫోకస్ చేయనున్నారు సీఎం చంద్రబాబు.
వ్యవసాయం, అటవీ సంపద, గనులపై తొలి చర్చ
జిల్లాల్లో పాలనాపరమైన అంశాలు, విధాన నిర్ణయాలు, సంక్షేమ పథకాల అమలు, ఇసుక, వ్యవసాయ రంగం తదితర అంశాల్లో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వానికి స్పష్టత ఉంది. దీంతో సమావేశంలో తొలుత ప్రాథమిక రంగాలపైనే చర్చించనున్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు, అటవీ సంపద, గనులపై తొలి చర్చ జరిగేలా ఎజెండా రూపొందించారు. ఆయా అంశాలపై సంబంధిత శాఖల కార్యదర్శులు ప్రజెంటేషన్లు ఇస్తారు. వారి ప్రాధాన్యాలు, లక్ష్యాలను కలెక్టర్ల ముందు ఉంచుతారు. అనంతరం బడుగు, బలహీన వర్గాల సంక్షేమంపై చర్చ ఉంటుంది.
శాంతి భద్రతలు, పాలనపై దృష్టి
తరువాత వైద్య, ఆరోగ్యశాఖ, సీజనల్ పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విద్యారంగం, పురపాలక, సీఆర్‌డీఏ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, హౌసింగ్, జల వనరులు, పౌరసరఫరాలు, పరిశ్రమలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. సాయంత్రం రెవెన్యూ శాఖపై చర్చ జరగనుంది. అసైన్డ్, చుక్కల భూములు, ప్రీహోల్డ్ అంశం, రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతల భూ ఆక్రమణలు, అసైన్డ్ భూముల పరాధీనం, అక్రమ రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లపై రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి.సిసోడియా ప్రజెంటేషన్ ఇస్తారు. అనంతరం శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు రివ్యూ చేయనున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం జాగ్రత్తలను ప్రభుత్వం గట్టిగా వివరించనుంది. ప్రారంభంలో రెవిన్యూ శాఖ మంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనంతరం సీఎం చంద్రబాబు కీలక ఉపన్యాసం ఇవ్వనున్నారు.
పరిపాలన గాడిలో పడుతున్న క్రమంలో పాలనపై మరింత పట్టు బిగించే విధంగా చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ముందుగా రెండు రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలని భావించినా.. ఇవాళ ఒక్కరోజే సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. సాయంత్రం కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో శాంతిభద్రతలపై సమీక్ష నిర్వహించి సమావేశాన్ని ముగించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ఎజెండాను ఖరారు చేసింది.