Bullet Proof car Alloted for Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. మాజీ సీఎం వైఎస్ జగన్ కారులో ప్రయాణించారు. ఈ వార్త వినగానే షాక్ తిన్నారా.. ఇద్దరూ రాజకీయంగా బద్ధ శత్రువులు కదా.. అలా ఎలా జరిగిందని డౌట్ పడుతున్నారా.. ఇదెప్పుడు జరిగిందని గూగుల్ చేస్తున్నారా.. అయితే అంత ఎగ్జైట్ కావాల్సిన అవసరం లేదు.. కానీ, ప్రయాణించిన మాట మాత్రం నిజమేనని తెలిసింది. ఏపీ డిప్యూటీ సీఎంగా బుధవారం బాధ్యతలు స్వీకరించనున్న పవన్ కళ్యాణ్.. అంతకుముందే సచివాలయాన్ని సందర్శించనున్నారు. ఇందుకోసం ఆయన హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇక గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి
విజయవాడలోని క్యాంపు కార్యాలయానికి వెళ్లారు.
అయితే గన్నవరం విమనాశ్రయం నుంచి క్యాంపు కార్యాలయానికి పవన్ కళ్యాణ్ బుల్లెట్ ప్రూఫ్ కారులో వెళ్లారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ప్రభుత్వం పవన్ కళ్యాణ్‌కు కేటాయించింది. వైప్లస్ సెక్యూరిటీతో పాటుగా బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది. దీంతో ఈ బుల్లెట్ ప్రూఫ్ కారులో పవన్ కళ్యాణ్ గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడలోని క్యాంపు ఆఫీసుకు చేరుకున్నారు. క్యాంప్ ఆఫీసు వద్ద పవన్ కళ్యాణ్‌కు అధికారులు ఘన స్వాగతం పలికారు. పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆర్ట్ డైరెక్టర్ సాయితో కలిసి క్యాంప్ ఆఫీసును పవన్ కళ్యాణ్ పరిశీలించారు.
క్యాంపు ఆఫీసును పరిశీలించిన పవన్ కళ్యాణ్ పలు సూచనలు చేసినట్లు తెలిసింది. పై అంతస్తులో నివాసం.. కింద ఆఫీసు ఉండేలా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం జనసేన పార్టీ కార్యాలయానికి పవన్ కళ్యాణ్ బయల్దేరి వెళ్లారు. మధ్యాహ్నం తర్వాత సచివాలయం చేరుకుని తనకు కేటాయించిన ఛాంబర్‌ను పవన్ పరిశీలిస్తారు. మరోవైపు టీడీపీ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యా్ణ్ డిప్యూటీ సీఎం హోదాతో పాటుగా.. గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ, పంచాయతీరాజ్, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా నియమితులయ్యారు. బుధవారం డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ముందుగా తన ఛాంబర్, ఇతరత్రా ఏర్పాట్లను పవన్ కళ్యాణ్ పరిశీలించారు.