అధికారంలోకి వచ్చాక ప్రతీ సంవత్సరం మెగా డీఎస్సీ (Mega DSC) అంటూ మాటలు చెప్పిన జగన్ (CM Jagan).. ఆ మాటే మరిచినట్టున్నారు. ప్రతీ ఏడాది కచ్చితంగా డీఎస్సీ ఉంటుందంటూ అభ్యర్థులు ఎదురుచూస్తూ ఉండగానే నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి.
కానీ.. అధికారంలోకి వచ్చాక జగన్ మాత్రం ఆ విషయంపై కనీసం దృష్టి పెట్టిన దాఖలాలు కూడా లేవు. అయితే నాలుగుసంవత్సరాలుగా డీఎస్సీపై ఊసెత్తని ప్రభుత్వం.. రెండు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయనగా ఇప్పుడు మేల్కొంది. కంటితుడుపుగా డీఎస్సీ ప్రకటన చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది.
ఈరోజు (బుధవారం) ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ ఈరోజు విడుదల కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. మొత్తం 6 వేల 100 పోస్ట్‌లకు నోటిఫికేషన్ విడుదలకానుంది. అయితే రాష్ట్రంలో 25 వేల పోస్ట్ లు ఖాళీగా ఉన్నాయని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. కేవలం 6 వేల 100 పోస్ట్‌లకు మాత్రమే డీఎస్సీ ప్రకటన ఇచ్చి ప్రభుత్వం చేతులు ఎత్తేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ వైఖరిపై విద్యార్థి, యువజన, ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.