AP DSC Free Coaching 2024: నిరుద్యోగులకు భలేఛాన్స్‌.. డీఎస్సీకి ఉచిత కోచింగ్‌! ఎప్పటినుంచంటే

అమరావతి, జూన్‌ 24: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ స్టడీ సర్కిళ్లలో వెనుకబడిన తరగతుల విద్యార్థులకు, నిరుద్యోగులకు డీఎస్సీ కోచింగ్‌ను ఉచితంగా అందించనున్నారు.


ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్ సవిత ప్రకటన వెలువరించారు. ఆమె మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం బీసీ స్టడీ సర్కిళ్ళలో ఉచిత డీఎస్సీ కోచింగ్, ఎన్టీఆర్ విదేశీ విద్య పథకం కొనసాగింపు పథకాలపై సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఎన్టీఆర్‌ విదేశీ విద్య పథకాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. అలాగే 2014-19 లో ఉమ్మడి 13 జిల్లాలకు మంజూరు చేసిన బీసీ భవన్‌ల నిర్మాణాలను సైతం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

ఇంకా వెలువడని టెట్ ఫలితాలు.. అయోమయంలో అభ్యర్థులు

మరోవైపు ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (AP TET-2024) రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులతో పాటు డీఎస్సీ అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. గత ఫిబ్రవరిలో టెట్‌ ప్రకటన వెలువరించి, అదే నెలలో ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించిన విద్యాశాఖ.. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు పరీక్షలు నిర్వహించింది. నాటి షెడ్యూల్‌ ప్రకారం మార్చి 14న ఫలితాలు ప్రకటించాల్సి ఉండగా.. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కోడ్‌ కారణంగా ఫలితాలు వాయిదా పడ్డాయి. ఎన్నికల అనంతరం ఏర్పడిన కొత్త ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటన వెలువరించింది. త్వరలో నోటిఫికేషన్‌ వెలువడనుంది. డీఎస్సీ నియామక ప్రక్రియ ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

అయితే ఇప్పటికే టెట్‌ పరీక్ష రాసిన వారు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తుండగా.. కొత్తగా డీఎడ్‌, బీఎడ్‌ ఉత్తీర్ణత పొందిన వారు డీఎస్సీకి ముందే మరోమారు టెట్‌ పరీక్ష నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తద్వారా తాము కూడా డీఎస్సీ పోస్టులకు పోటీపడే అవకాశం ఉంటుందని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో టీచర్‌ ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థులు పోటాపోటీగా సన్నద్ధమవుతున్నారు. అలాగే టెట్ ఫలితాలు విడుదలైతేనే డీఎస్సీకి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. టెట్ అర్హత సాధిస్తే ఉపాధ్యాయ నియామక పరీక్షలో 20 శాతం వెయిటేజీ ఉంటుంది. ఫలితాల విడుదల తేదీ, డీఎస్సీ విధివిధానాలపై ప్రకటన వెలువరించాని అభ్యర్థులు కోరుతున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి త్వరలో ప్రకటన వెలువడే అవకాశం ఉంది.