వచ్చే నెలలో ఏపీలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ల మొగ్గు ఎటువైపు ఉందన్న దానిపై ఇప్పటికే పలు సర్వేలు వెలువడ్డాయి. ఇందులో కొన్ని వైసీపీకి జై కొట్టగా.. మరికొన్ని ఎన్డీయే కూటమిదే అధికారమని తేల్చాయి. అయితే స్ధానిక సర్వేలతో పోలిస్తే జాతీయ స్ధాయిలో వెలువడిన సర్వేల్లో ఎక్కువగా ఎన్డీయే కూటమి గెలిచే అవకాశం ఉందని వెల్లడించాయి. ఇదే క్రమంలో తాజాగా మరో జాతీయ మీడియా సంస్ధ చేసిన సర్వే ఫలితాలు వెల్లడించింది. ఇందులో ఫలితాలు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. జాతీయ మీడియా సంస్ధ న్యూస్ ఎక్స్ తాజాగా నిర్వహించిన సర్వేలో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ వర్సెస్ కూటమి మధ్య హోరాహాోరీ పోరు సాగుతున్నట్లు తేలింది. ముఖ్యంగా అధికార వైసీపీకీ, విపక్ష టీడీపీకి మధ్య ముఖాముఖీ పోరు నెలకొన్నట్లు తేల్చింది. లోక్ సభ సీట్లలో చూసుకుంటే వైసీపీ, టీడీపీ మధ్య సాగుతున్న పోరులో తెలుగుదేశం పార్టీకి న్యూస్ ఎక్స్ సర్వే ఆధిక్యాన్ని కట్టబెట్టింది. రాష్ట్రంలోని 25 ఎంపీ సీట్లకు జరుగుతున్న ఎన్నికల్లో టీడీపీ ఒక్కటే ఏకంగా 14 ఎంపీ సీట్లు దక్కే అవకాశం ఉన్నట్లు న్యూస్ ఎక్స్ ఒపీనియన్ పోల్ తేల్చింది.
అలాగే టీడీపీ మిత్రపక్షాలైన బీజేపీకి రెండు ఎంపీ సీట్లు, జనసేన పోటీ చేసిన రెండు సీట్లలోనూ గెలిచే అవకాశం ఉన్నట్లు న్యూస్ ఎక్స్ ఒపీనియన్ పోల్ వెల్లడించింది. అంటే మొత్తంగా ఎన్డీయే కూటమి రాష్ట్రంలోని 25 ఎంపీ సీట్లలో 18 గెల్చుకునే అవకాశం ఉందని వెల్లడించిది. అధికార వైసీపీకి మాత్రం కేవలం 7 ఎంపీ సీట్లే దక్కుతాయని తేల్చింది. ఈ గణాంకాల్ని అసెంబ్లీ స్ధానాలకు అన్వయిస్తే ఎన్డీయే కూటమి 126 సీట్ల వరకూ దక్కించుకోనుంది. వైసీపీకి 49 స్ధానాలు దక్కబోతున్నాయి.